రెడ్ క్రాస్ రక్తదాతల వాహానాలను ప్రారంభించిన గవర్నర్
18004251234 కు ఫోన్ చేస్తే దాతల చెంతకే వాహనం
రక్తదానాన్ని మించిన సేవ మరేదీ లేదని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రెడ్ క్రాస్ సేవలు అందేలా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేయాలని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ శాఖకు సమకూరిన రక్తదాతల శకటాలను (బ్లడ్ డోనర్ వ్యాన్స్) గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ వేదికగా శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఒక కరోనా పరీక్షా శకటంతో సహా ఐదు రక్తదాతల వాహానాలను సేవకు అంకితం చేసారు. వీటిని విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఓంగోలు, కర్నూలు నగరాలలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా సేకరించే రక్తం పేదల అవసరాల కోసం వినియోగిస్తున్నారని, ప్రత్యేకించి తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వాహానాల ద్వారా ఎక్కడైనా పది మంది దాతలు సిద్దంగా ఉంటే అక్కడికే వెళ్లి రక్తసేకరణ చేస్తారన్నారు. ఇందుకోసం 18004251234కు చరవాణి ద్వారా సంప్రదించవచ్చన్నారు. రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన రక్త దాతల వాహనాలు మనకు సమకూరాయని, మరో మూడు వాహనాలు రానున్నాయని వివరించారు. విజయవాడ కోసం ప్రత్యేకంగా మరిన్నిసౌకర్యాలు కలిగిన పెద్ద వాహనం రానుందన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఒక్కోక్క వాహనంలో ఏకకాలంలో నలుగురు దాతలు రక్తాన్ని అందించగలుగుతారని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి అధ్యక్షుడు ఎకె ఫరీడా మాట్లాడుతూ గౌరవ గవర్నర్ ఆశీస్సులతో రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.