ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని మరిచిపోయారు అని, ఇచ్చిన మాట తప్పారు అని ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ టీచర్స్ తలపెట్టిన మిలియన్ మార్చ్ ను అడ్డుకోవడానికి ప్రభుత్వం శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఎన్ని మార్గాలు వుంటే అన్ని మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. అదే సమయంలో న్యాయ బద్దమైన తమ కోరిక కోసం ప్రభుత్వ ఉద్ద్యోగులు, ఉపాధ్యాయులు పట్టు పడుతున్నారు. అంతే కాక ఈ మిలియన్ మార్చ్ మరియు సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేసి తీరుతాం అని అంటున్నారు.
సెప్టెంబర్ 1 న మిలియన్ మార్చ్ నిర్వహించి తమ నిరసన తెలపాలని APCPS ఎంప్లాయిస్ అసోషియేషన్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ‘చలో విజయవాడ’ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. CPS సభ్యులు, ఉపాధ్యాయులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరిని గృహనిర్భంధం చేస్తున్నారు. ఇప్పటికే పలుకేసుల్లో పేర్లు నమోదై ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న కారణంగా సీఎం నివాసం వద్ద మిలియన్ మార్చ్‌కు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెక్షన్ 149 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇచ్చి నిఘా పెడుతున్నారు. ముఖ్య నేతలను గృహ నిర్భంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై CPS ఎంప్లాయిస్ అసోషియేషన్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎవరినైనా గుర్తిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ముందస్తుగా విజయవాడలోని లాడ్జీలను జల్లెడ పడుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు, సమీప పట్టణాల్లో లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆశ్రయం కల్పించవద్దని ఓనర్లకు, అసోషియేషన్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న టీచర్లకు నోటీసులు ఇస్తున్నారు. అక్కడ లేకపోతే ఇంటికి వెళ్లి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లోని సుమారు 550 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పోలీసులు సీఆర్పీసీ 149 కింద నోటీసులు జారీ చేశారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.పోలీసుల అడ్డగింతలు, ఉద్ద్యోగుల పట్టుదలతో సెప్టెంబర్ 1 న జరిగే మిలియన్ మార్చ్ మీద సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.