జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా విఫలమైన విభాగం మాత్రం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో అని చెప్పక తప్పదు. సీఎం జగన్ ప్రతిసారీ మా మానిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్ భగవత్ గీత తో సమానం, ఇప్పటికే 95% మానిఫెస్టో లో పనులు చేసేశాం అంటారు. కానీ నిరుద్యోగుల విషయంలో మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది.
వైసీపీ 2019 మానిఫెస్టో చూస్తే “రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం” అని ప్రకటించారు. అంతే కాక ప్రతి సంవత్సరం జనవరి 1 వ తారీఖున జాబ్ క్యాలండర్ విడుదల చేస్తాం అని కూడా అన్నారు. అంతేకాక ప్రతిపక్ష నాయకునిగా పాదయాత్ర చేస్తూ మెగా DSC పెడతాను అని కూడా వాగ్దానం చేశారు. కానీ ఇవన్నీ కేవలం పేపర్ మీద మాత్రమే ఉన్నాయి. వాస్తవ రూపం దాల్చలేదు, కేవలం గ్రామ, వార్డ్ సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చి అదేదో ఘనకార్యం లా పార్టీ పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ పార్టీ మానిఫెస్టో ప్రకారం గ్రామ, వార్డ్ సచివాలయంలో ఉద్యోగాలు కాకుండా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాను అని చెప్పారు.
ప్రస్తుతం పాఠశాలల క్రమబద్దీకరణ పేరుతో కొన్ని స్కూల్స్ మూతపడ్డాయి. అలాగే ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ఎసరు పడుతుందేమో అనుకుంటున్న సమయంలో జగన్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర నోటిఫికేషన్ జారీ చేసింది. 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్(స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 23వ తేదీన cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.