ఏడు అడుగుల పటిష్ఠమైన సిమెంట్ దిమ్మపై 30 అడుగుల కాంస్య విగ్రహం అమరిక పనులు వేగంగా పూర్తి చేశారు. ఈ విగ్రహం తయారీకి మూడు కోట్లు వ్యయం చేశారని కమిటీ తెలిపింది. పాలకొల్లు మండలం ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత మూడు కోట్లు విరాళం అందజేశారు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పి బుర్రా ప్రసాద్ ఈ విగ్రహాన్ని 32 రోజులలో తయారు చేశారు. దీని నిర్మాణానికి 10 టన్నుల కాంస్యం మెటీరియల్, 7 టన్నుల స్టీలును వినియోగించారు. మన్యం వీరుడి రూపురేఖలు అచ్చుగుద్దినట్లు ఎడమ చేతిలో విల్లు, కుడిచేతిలో బాణం పట్టుకుని ఉన్నట్టుగా చక్కటి ఆహార్యంతో ఈ విగ్రహం సిద్ధమైంది. దేశంలోనే అతిపెద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహంగా ఇది రికార్డులకు ఎక్కనుంది. భీమవరంలో ప్రధాని మోడి పర్యటన నేపథ్యంలో… పోలీసులు పటిష్టంగా చర్యలు చేపట్టారు. మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపధ్యంలో ఉండి మెయిన్ సెంటర్లో వాహనాలను భీమవరం వైపు వెళ్ళనీయకుండా రహదారిని పోలీసులు దిగ్బంధనం చేశారు. భీమవరం ప్రధాని మోడి కార్యక్రమానికి వెళుతున్న బస్సులను సైతం ఆపేశారు. దీంతో ఉండి మెయిన్ సెంటర్లో వాహనాల రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
ప్లాస్టిక్ కవర్‌లో శాలువా తీసుకెళుతున్న ఉపముఖ్యమంత్రి.. అడ్డుకున్న డిజిపి
పెద అమిరంలో ప్రధానమంత్రి మోడి హెలిప్యాడ్ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్లాస్టిక్ కవర్ లో శాలువా తీసుకెళుతుండగా… డిజిపి రాజేంద్రనాథ్రెడ్డి మంత్రిని అడ్డుకున్నారు. ప్లాస్టిక్ కవర్‌ను తనిఖీ చేసి కేవలం శాలువతో మాత్రమే వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణకు సూచించారు.
అతిథులకు అవమానం
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు హాజరయ్యారు. అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజి ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పినప్పటికీ తన జాబితాలో లేదని ఆయన తేల్చిచెప్పేశారు. కేంద్ర మంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పటంతో బసచేసిన ప్రాంతంలోని అచ్చెనాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్వానించి అవమానించడం ఏమిటని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ నిరసన…అరెస్ట్
రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. పీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాగా… జాంపేట గాంధీ బొమ్మసెంటర్ వద్ద కాంగ్రెస్ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శైలజానాధ్ సహా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపి విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని… ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
పీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆందోళనకు దిగారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై బ్లాక్ బెలూన్‌తో గో బ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి మోదీ, జగన్ కలిసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు… ఎయిర్‌పోర్టు వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి
భీమవరం సభలో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలను నెరవేర్చాలన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి తగు నిధులు కేటాయించాలని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, కేంద్రీయ విద్యాసంస్థలకు తగు నిధులు మంజూరు చేయాలని తెలిపారు.