శ్రీకాకుళం జిల్లాలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలో పుట్టగొడుగులు లభించడంతో స్థానికులు వాటిని వండుకుని తిన్నారు.పుట్ట గొడుగులు కూర తిన్న వారంతా వాంతులు కావటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన 18 మందిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లో కొన్ని రకాలు విషపూరితం
పుట్టగొడుగుల్లో 2000లకు పైగా జాతులు ఉన్నాయి. ఇందులో కేవలం 25 జాతులు మాత్రమే తినడానికి పనికొస్తాయి. ఇటీవల అస్సాంలో ఇలాంటి ఘటనే జరిగింది. విషపూరిత పుట్టగొడుగులు తిని అక్కడ 13 మంది చనిపోయారు…చాలా మంది దుకాణాల్లో పుట్టగొడుగులు కొనే బదులుగా ఇతర ప్రాంతాల్లో దొరికే విషపూరిత పుట్టగొడుగులను సాధారణ పుట్టగొడుగులుగా భావించి ఇంటిలో వండుకొని తింటుంటారు… దీంతో అస్వస్థత గురికావడం జరుగుతుంది…
”సాధారణంగా విషపు మష్రూమ్‌లకు, మంచి వాటికి మధ్య తేడాను ప్రజలు అర్థం చేసుకోలేరు. అందుకే పొరపాటున విషపు పుట్టగొడుగులను తింటారు” అని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనీ, అయితే ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలేవీ జరగడం లేదని డాక్టర్లు అభిప్రాయం. ఒక్కోసారి సాధారణ పుట్టగొడుగులు కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంటాయి.. ”ఏడేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు పుట్టగొడుగులను ఆహారంలో ఇవ్వకూడదు. వాటిని జీర్ణం చేసే ఎంజైమ్‌లు పిల్లల్లో ఉండవు” అని వైద్యులు సూచిస్తున్నారు.