సామాన్యంగా ఈ కాలంలో విద్యార్థులకు వేసవి సెలవులు ఇస్తూ ఉంటారు. విద్యార్థులు తరువాతి సంవత్సరం చదువులకు రాబోయే పరీక్షలకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధం అవడానికి ప్రభుత్వాలు శెలవులు (హాలిడే) ప్రకటిస్తూ ఉంటారు, కానీ విచిత్రంగా మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పంటలు పండించే రైతన్నలు, కాయ కష్టం చేసుకొనే కార్మిక అన్నలకు హాలిడే ప్రకటించడం చూస్తున్నాం.
తూర్పు గోదావరి జిల్లాలోనీ కోనసీమలో దశాబ్ద కాలం తరువాత మళ్ళీ క్రాప్ హాలిడే మాట వినపడుతుంది. 2011 లో దేశవ్యాప్త చర్చకు కారణం అయిన క్రాప్ హాలిడే పరిస్థితులు మళ్ళీ కనబడుతున్నాయి, పచ్చని కోనసీమ లోని సెంట్రల్ డెల్టా పరిధిలో సంవత్సరానికి రెండు పంటలు పండుతాయి, సాగు నీటి కాలువలు పూడకపోవడం, గోదావరి ముంపు, వరుస విపత్తులు వలన పంటలు నష్టపోతుండడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతన్నలు చెప్తున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామ రైతులు 900 ఎకరాల్లో, గోపవరం, సరిపల్లి గ్రామ రైతులు 1000 ఎకరాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల క్రాప్ హాలిడే ప్రకటించారు. డెల్టా లో కాలువలకు నీళ్ళు వదిలి 15 రోజులు దాటినప్పటికీ ఆశించిన స్థాయిలో నారుమళ్లు వేయకపోవడం చర్చనీయాంశం అయ్యింది, జిల్లాలో రెండు లక్షల హెక్టార్ల మించి వరి సాగు ఉంటే ఇప్పటివరకు లక్ష హెక్టార్లలో నారుమళ్లు వేశారు.
కాకినాడ డ్రైనేజీ పరిధిలో భారీ,మధ్య, చిన్న తరహా డ్రైనేజీలు ఉన్నాయి. 1560 కి.మి. పొడవునా ఉన్న డ్రెయిన్ల ఆధునీకరణ సమర్థవంతంగా లేక భారీ వర్షాలు, వరదల సమయాల్లో మురుగు భారీగా పొలాల్లోకి ముంచుకొస్తుంది. కోనసీమ ప్రాంతం ఏటా ఖరీఫ్ లో తీవ్రంగా ప్రభావితమవుతుంది. సఖినేటిపల్లి,మలికిపురం,రాజోలు, మామిడికుదురు,అల్లవరం,అమలాపురం, ఉప్పలగుప్తం, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికొన తదితర మండలాల్లో పొలాలు ముంపు భారిన పడుతుండడం తో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు, అధికారులు రైతులను ఈ క్రాప్ హాలిడే విరమించుకోవాలని అని కోరినా రైతులు వినడం లేదు.
భవన నిర్మాణ సామగ్రి, ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదెలైపోయింది అని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) సహా పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్పత్తి సంస్థలు సిండికేట్ గా మారి ధరల్ని విపరీతంగా పెంచేశాయి అని ధ్వజమెత్తాయి. టన్ను స్టీలు ధర 40 వేల నుండి 90 వేల రూపాయిలకు, బస్తా సిమెంట్ ధర 250 నుండి 450 రూపాయిలకు పెరిగింది అని, ఇదంతా చూస్తుంటే దోపిడీల ఉంది అని, 2020 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు భవన నిర్మాణ ముడి సరుకుల ధరలు 40 నుండి 50 శాతం మేర పెరిగాయి అని పేర్కొన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం, సిమెంట్ కంపెనీలు కలిసి అని చేస్తున్నాయా? అని ప్రశ్నించాయి.
భవన నిర్మాణ సామగ్రి, ముడి సరుకుల ధరలు పెరుగుదల ను నిరసిస్తూ క్రెడాయ్, బీఎఐ, ఎల్టీపీ, బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తదితర సంఘాలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పనికివిరామం ( work holiday) పాటించాయి.
అధికారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి “నేను ఉన్నాను, నేను విన్నాను” మీ బాధలకు పరిష్కారం నేను చూపిస్తాను అని నమ్మించి, రైతుల, కార్మికుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన తరువాత ఆయా రంగాలను నిర్లక్ష్యం చేసి క్రాప్ హాలిడే, వర్క్ హాలిడే ల వైపు రాష్ట్రాన్ని నడిపించి పేద వారి కన్నీటికి కారణం అవుతున్నారు.






								
				
				
			