ఏపీ సీఎంకి రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, వైసీపీ మధ్య చాలా దృఢమైన రహస్యబంధం ఉందని, వారి స్వప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తారన్న వాస్తవం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ద్వారా మరోమారు రుజువైందన్నారు. వైసీపీ తరఫున తన కేసులు వాదించే తెలంగాణకు చెందిన నిరంజన్‌రెడ్డి, తన సహనిందితుడు విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీట్లు ఇవ్వగా, తన రాజకీయ గురువు కేసీఆర్ సహకారంతో మరో నిందితుడు హెటిరో పార్ధసారధిరెడ్డిని టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయించుకోగలిగారని పేర్కొన్నారు. చట్టంలోని లొసుగులను వినియోగించుకుని, నేరస్తులు, వారికి అండగా నిలిచే వారిని పెద్దల సభకు చేరుకునే కార్యక్రమం జరగడం బాధాకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ఏపికి చెందిన సుమారు 20 వేల కోట్లకు పైగా ఉన్న తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విషయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఏపి సీఎం జగన్ సహకరించారని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి, తన సహ నిందితుడికి రాజ్యసభ సభ్యత్వం కోసం కేసిఆర్ సహకారంతో తీసుకోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమన్న విషయం మరోమారు రుజువైందన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు దిగజారుతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక స్థితి, పరిపాలన వైఫల్యం గురించి మాట్లాడగా వారిపై రెచ్చిపోయి మీడియాలో మాట్లాడిన రాష్ట్ర మంత్రులు కేవలం ప్రకటనలకు పరిమితమన్నారు. వారు మీడియా ముందు మాట్లాడేదానికి వాస్తవంలో జరిగే సంఘటనలకు సంబంధం లేదన్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నా మాట్లాడలేని స్థితిలో రాష్ట్ర మంత్రులు ఉన్నారన్నారు. ఏపీ ప్రజలు జరుగుతున్న పరిణామాలు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీ లాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.