తెలుగులో మొట్టమొదటి వాగ్గేయకారుడు, ఆంధ్రా కవితా పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారు మనందరికీ పరిచయమే, ఆయన 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే శ్రీ వేంకటేశుడు ముద్దలు తిన్నారో ? లేదో ? తెలియదు గానీ మన తెలుగింటి అమ్మలకు మాత్రం ఆ పాట లేనిదే పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేరు; జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్దర పోయారో? లేదో? తెలియదు గానీ మన తెలుగింటి పిల్లలు మాత్రం ఇట్టే నిద్రపోతారు, అంతలా ఆయన పాటలు మన తెలుగింట నిండిపోయాయి, మన తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు అయ్యాయి, జనాల్లోకి చొచ్చుకొని పోయాయి. అంతలా మన సంస్కృతిలో, మన జీవితాల్లో భాగమైన శ్రీ అన్నమాచార్యుల వారు తిరుమలలో నివాసమున్న ఆయన ఇంటిని, అన్నమయ్య మండపాలను టీటీడీ యాజమాన్యం కూల్చివేస్తుంది. మాడ వీధుల్లోనీ మఠాలను తొలగిస్తూ మొదట అన్నమయ్య ఇంటిని, తరువాత మండపాన్ని, ఇప్పుడు అన్నమయ్య,ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా తొలగించారు.
మాడ వీధుల్లోనీ మఠాలను, అన్నమయ్య విగ్రహాలను ఒకేరకంగా అధికారులు చూడడం బాధాకరం, కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకొంటున్న అన్నమయ్య, ఆంజనేయ స్వామి విగ్రహాలను తొలిగించే అధికారం టీటీడీ అధికారులకు లేదు అన్న విషయం తెలుసుకోక పోవడం విచారించాల్సిన విషయం, తిరుపతిలోని అన్నమాచార్య ప్రాజెక్ట్ ను కూడా కళావిహీనం చేసేసారు. తక్షణమే అన్నమయ్య ఇంటిని, మండపాన్ని తిరిగి నిర్మించడంతో పాటు, అన్నమయ్య , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేయాలి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందువుల గుళ్ల మీద, విగ్రహాల మీద ఉద్దేశ పూర్వకంగా దాడులు జరుగుతున్నాయి, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది, అంతేకాక దోషులను పట్టుకోవడంలో కూడా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. ఇప్పుడు తిరుమల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వం దగ్గర ఉండి మరి అన్నమయ్య జ్ఞాపకాలను తుడిచేస్తున్నాయి. ఈ విషయమై హిందూ సంఘాలు తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ఈ సంఘటనలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాయి.