పార్టీలో అంతర్గత విభేదాలు లేవు అంటూ చెప్పుకుంటున్న మన వైసిపి నేతలు ,తమలో తమకే పడక విమర్శించుకుంటున్నారు. మాకు అంతర్గత విభేదాలు లేవు,మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నాము అని పైకి ఎన్ని చెప్పుకున్నా….తాజాగా హిందూపురంలో జరిగిన సంఘటన చూస్తే అర్ధమవుతుంది తమలో తమకు ఎంత సఖ్యత ఉందో అని.
హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాట జరిగింది. హిందూపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సాక్షాత్తు వైసీపీ మహిళా కౌన్సిలర్లే నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఇంద్రజ, ఎంపీ గోరంట్ల మాధవ్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా.. హిందూపురం మున్సిపాలిటీ ప్రాంతంలో డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారపార్టీ మహిళా కౌన్సిలర్లు సమస్యలు లేవనెత్తారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు వెళ్లినప్పుడు వారికి ఎదురైన సమస్యల దృష్ట్యా నేతలు ఈవిధంగా స్పందించి ఉంటారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.