సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాల్లో అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఏకంగా మొదటి 3 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. శ్రుతి శర్మ, అంకితా అగర్వాల్, గామిని సింగ్లా వరుసగా 1, 2, 3 ర్యాంకులు సాధించారు. ఆడపిల్లలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనే దానికి వీరు ఆదర్శంగా నిలిచారు.
శ్రుతి శర్మ ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ చదివారు. సివిల్స్ పరీక్షలకు హిస్టరీనే ఆప్షనల్‌గా ఎంచుకున్నారు.ఎన్నిగంటలు చదువుతున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత నాణ్యంగా చదువుతున్నామన్నదే ముఖ్యం అంటూ తను చదివిన విధానాన్ని వివరించారు.అయితే మెయిన్స్ రాసేముందు కోచింగ్ మెటీరియల్‌పై ఆధారపడకుండా వార్తాపత్రికల ఆధారంగా సొంత నోట్స్ తయారు చేసుకున్నాను అని,ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివాను అని తన అనుభవాలను పంచుకున్నారు.
అంకితా అగర్వాల్ కూడా ఢిల్లీ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్ చదివారు. అయితే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్‌తో సివిల్స్ రాశారు.
గామిని సింగ్లా బీటెక్ కంప్యూటర్ సైన్స్‌చేశారు. సివిల్స్ కోసం సోషియాలజీని ఆప్షనల్ తీసుకున్నారు. ఐశ్వర్య వర్మ, ఉత్కర్ష్ ద్వివేది 4, 5 ర్యాంకులు సాధించారు. సోమవారం విడుదల చేసిన ఫైనల్ ఫలితాలపై సందేహాలుంటే 23385271 / 23381125 / 23098543 నంబర్లలో సంప్రదించవచ్చని యూపీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15రోజుల్లోగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కమిషన్ వెల్లడించింది.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కనీసం 40 మంది సివిల్స్‌కు ఎంపికైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను దాటుకొని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీస్ గ్రూప్-ఏ, బి పోస్టులకు మొత్తం 685 మంది ఎంపికయ్యారు.
కాగా, సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశం అభివృద్ధి పరంగా కీలక దశలో ఉన్న సమయంలో పాలనా బాధ్యతలు చేపట్టబోతున్న యువతకు అభినందనలు తెలియజేస్తున్నాను.’’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సివిల్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.