గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ అటుగా వెళ్లే వారందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రజలు తమ స్వార్థం కోసం చేస్తున్న పనులు తనకు ఎంతో బాధ కల్గిస్తున్నాయని చెరువు తన ఆవేదనను చెప్పినట్లుగా కొంతమంది ఆ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు.
“నా మీద చెత్త, వ్యర్థపదార్థాలు వేశారు. మద్యపానం సేవించి ఖాళీ సీసాలను నా మీదకి విసిరి.. నన్ను తాగుబోతును చేశారు.. అయినా భరించాను. గ్రూప్ రాజకీయలు చేసి.. నన్ను అభివృద్ధి చేయటం మరిచిపోయారు. అయినప్పటికీ నేను సహించాను. ఇప్పుడు ఏకంగా స్వప్రయోజనాల కోసం నా మీద అక్రమ కట్టడాలు కడుతూ.. నన్ను ఆక్రమిస్తున్నారు. మీరు చేస్తున్న పనులు నాకు ఎంతో బాధను కల్గిస్తున్నాయి. గుడిని, బడిని, ఇంటిని శుభ్రం చేసినట్లుగా.. దయచేసి నన్ను పరిశుభ్రం చేయండి. నన్ను అభివృద్ధి చేసి.. జాగ్రత్తగా చూసుకుంటే.. నేను మన గ్రామాన్ని, మిమల్ని భవిష్యత్తరాలు కాపాడతానని హామీ ఇస్తున్నాను. కుల, మత రాజకీయలకు అతీతంగా నన్ను అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ…
మీ సిరిపురం మంచి నీటి చెరువు