మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న వాటిల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలుష్యం పెరిగిపోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలన్న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో చర్యలు చేపట్టినట్లు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశాలను అమలుచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వీటి ప్రకారం.. ఒకసారి వినియోగించి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయడం, దిగుమతి చేయడం, నిల్వచేయడం, పంపిణీ, విక్రయంతో పాటు ఉపయోగించడం చట్ట ప్రకారం నిషేధించినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యంగా ప్లాస్టిక్ స్టిక్‌లతో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, బెలూన్లకు కట్టే ప్లాస్టిక్ స్టిక్కులు, ఐస్‌క్రీమ్ స్టిక్స్‌తో పాటు టీ, కాఫీ కలుపుకునేందుకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాటిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వార్డు వలంటీర్లు ప్రచారం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అన్ని వార్డుల్లోను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలపై కరపత్రాలను పంపిణీ చేయాలని, కూడళ్లల్లో హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేయాలన్నారు. సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శించడంతో పాటు, టీవీ స్క్రోలింగ్స్, ర్యాలీలు నిర్వహించాలన్నారు.
ఆ వస్తువులు ఉంటే లైసెన్స్ రద్దు
వాణిజ్య షాపులు, రిటైలర్లు, అమ్మకందారులు, వీధి వ్యాపారులు, కూరగాయలు, పండ్ల మార్కెట్లు, మాల్స్‌తో పాటు ఇతర సంస్థల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పరికరాలు, క్యారీ బ్యాగులు నిల్వచేయడంతో పాటు వినియోగించినట్లు తేలితే ఆయా దుకాణాలు, షాపుల వాణిజ్య లైసెన్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. దీంతోపాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తామన్నారు.
ఇక నుంచి అమలులోకి వచ్చే నిబంధనలను అమలుచేసేందుకు, దుకాణాలను తనిఖీ చేసేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 805 టాస్క్‌ఫోర్సు బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఈ బృందాలు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల 158 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగులను సీజ్ చేసి, రూ.1.54 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు.
ప్లాస్టిక్ నిషేధం అమలుకు విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు ప్రారంభించారు. తొలిదశలో 20 మైక్రాన్లలోపు, క్రమంగా 40, 70 మైక్రాన్లలోపు బరువున్న కవర్లపై జీఎంసీ నిషేధం విధించింది. ఇప్పుడు మందంతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కవర్లనే పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.ప్లాస్టిక్ నిషేదాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ముందుగా నగరపాలక సంస్థ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నుండే ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వినియోగంపై చైతన్యవంతులను చేయుటకు చర్యలు తీసుకున్నట్లు నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. పేర్కొన్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఆవరణలో మేయర్ కమిషనర్ అధికారులు, సిబ్బందితో కలసి ప్లాస్టిక్ నిర్మూలనకై ప్రతిజ్ఞా నిర్వహించారు.
నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వచ్చ్ సర్వేక్షణ్ నందు జాతీయ స్థాయిలో మన నగరం 3వ స్థానములో ఉండుట మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. రాబోవు రోజులలో ఇదే స్పూర్తితో మొదటి స్థానం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన ఆవశ్యకత మనందరిపై ఉందని అన్నారు. అధికారులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతోనే ర్యాంక్ సాధించుట జరిగిందని, ఇటివల కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రలో ఇతర నగరాలు కూడా మనం 3 స్థానం సాధించుట పట్ల అభినందనలు కూడా వచ్చాయని వివరించారు. అతి చిన్న నగరం అయినప్పటికీ మనం చేపట్టిన సంస్కరణ వల్ల మిగిలిన రాష్ట్రాలతో పోటి పడి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుట జరిగిందని, దానిని నిలుపుకొనుట మనందరి ప్రధమ కర్తవ్యం గా భావించి నేడు చేపట్టిన ఈ ప్లాస్టిక్ నివారణ చర్యలు మీరందరూ భాగస్వాములై మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు మరియు తోటి స్నేహితులు మరియు చుట్టూ ప్రక్కల నివాసాల వారికీ ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు అనర్ధములు వివరించి వారిలో చైత్యనం నింపి పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణను ప్రజలందరూ విధిగా అమలు చేసే విధంగా చూడాలని అన్నారు.
అదే విధంగా కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్త్పతులను నిషేధించాలని అన్నారు. ముందుగా మనం పాటిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో నేడు ఈ కార్యక్రమము చేపట్టినట్లు, రేపటి నుండి మన కార్యాలయంలో ముందుగా పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయుట జరుగుతుందని పేర్కొన్నారు. అందరికి తెలిసిన విషయం మన నగరం జాతీయ స్థాయిలో స్వచ్చ్ సర్వేక్షణ్ నందు 3వ స్థానంలో ఉన్నాం, ఆ స్థానాన్ని నిలపెట్టుకోవలననిన లేదా మొదటి లేదా రెండోవ స్థానం కైవసం చేసుకోవాలన ప్రతి ఒక్కరం భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేదించి వాటికీ బదులుగా జ్యూట్, క్లాత్ వంటి సంచుల వాడకం మరియు మన ఇంటి, నగర పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అంశాలను విధిగా పాటించి నగరంలో పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు పూర్తి భాద్యత చేపట్టాలని అన్నారు. దీని ద్వారా ప్రజలలో కూడా చైత్యనం వస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ రహిత గణేష్ ఉత్సవాలు నిర్వహించుకొనేలా ప్రజలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయముతో పాటుగా మూడు సర్కిల్ కార్యాలయాలలో మరియు సచివలయాలలో విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు అందరు సిబ్బంది వారి వారి కార్యాలయాలలో ప్రతిజ్ఞా నిర్వహించుట జరిగింది. కళాజాతర బృందం ద్వారా ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు ఇబ్బందులు, పరిసరాల శుభ్రత తదితర అంశాలపై నృత్యగేయాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించట మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవి వాడకూడదు, వాటి స్థానంలో వేటిని వినియోగించాలి అవగాహన కలిగే విధంగా పలు ఉత్త్పతులను ప్రదర్శనగా ఏర్పాటు చేసారు. కార్యక్రమములో అధికారులతో పాటుగా అన్ని విభాగములలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞా చేసారు.
గుంటూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు…. సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.నగరంలో రోజుకు 450 టన్నులకుపైగా చెత్త వెలువడుతోంది. అందులో 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు ఉంటున్నాయి. వాటిని కాల్వల్లో, రహదారులపై పడేయటం వల్ల పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ సంచుల్లో పడేయటంతో వాటిని తిన్న మూగజీవాలు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాయి. అందుకే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం ఒక్కటే ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తుందని యంత్రాంగం భావిస్తోంది.
నగరపాలక సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. తయారీదారులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ, చిల్లర వర్తకులకు 2వేల 500 నుంచి 15వేల రూపాయల వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తారు. ఒకవేళ ప్రజలెవరైనా ప్లాస్టిక్ కవర్లతో కనిపిస్తే వారికి 100 నుంచి 250 రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
“నగరపాలక సంస్థ ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేశాం. తయారీదారులకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ, చిల్లర వర్తకులకు రూ.2వేల 500 నుంచి రూ.15వేల వరకూ అపరాధ రుసుము వసూలు చేస్తారు. ఒకవేళ ప్రజలెవరైనా ప్లాస్టిక్ కవర్లతో కనిపిస్తే వారికి రూ.100 నుంచి రూ.250 వరకూ జరిమానా విధిస్తాం అని గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు హెచ్చరించారు…