తాను ఈ దేశంలో 130 కోట్లమంది ప్రజలకు ఒక సేవకుడిగా భావిస్తున్నానని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలని, పేద ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమఅయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో రిడ్జ్ మైదాన్ లో జరిగిన ‘ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ’లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొని వివిధ పథకాల లబ్ధిదారులతో వర్చువల్ విధానం ద్వారా ముఖాముఖిగా సంభాషించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తొమ్మిది శాఖల పరిధిలోని సుమారు 16 పథకాల లబ్ధిదారులతో ఆయన వివిధ విషయాలపై ఆరా తీశారు.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలతో సంభాషించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఏర్పాటుచేశారు. .
కేంద్ర పథకాల లబ్ధిదారులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకల్లో భాగంగా దేశంలో తొమ్మిది మంత్రిత్వ శాఖలు, పదహారు పథకాల కార్యక్రమాల గురించి పలువురు అధికారులు వివరించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ మరియు పట్టణ), జల్ జీవన్ మిషన్, అమృత్, ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన, వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ప్రధాన మంత్రి ముద్రా యోజన వంటి పథకాలు ఉన్నాయి. అలాగే రూ. 21,000 కోట్ల విలువైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడతను మే 31న సిమ్లాలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు జమ చేస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించింది.10 కోట్లకు పైగా రైతుల ఖాతాలో రూ.21,000 కోట్లకు పైగా నిధులను మంగళవారం జమ కాబడింది.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో ‘ గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పేద ప్రజలను ఆదుకోవడం కోసం, వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)ను ఆవిష్కరించిందన్నారు. కృష్ణాజిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుకాబడుతున్నాయన్నారు. ఒక లక్షా 78 వేల హెక్టార్ ఎకరాలలో వ్యవసాయం ఉందని, జిల్లాలో 390 రైతుభరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాయని వివరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కృష్ణాజిల్లాలో ఇంటింటికి ఏర్పాటుకై 3.82 లక్షల కొత్త కుళాయిలు ఏర్పాటుచేయాల్సి ఉండగా గత ఆర్ధిక సంవత్సరం 1.85 లక్షల కుళాయిలు సమకూరినట్లు తెలిపారు. 618 పనులకు రూ.159.07 కోట్లు పెడన అవనిగడ్డ, పామర్రు, గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గాలలోని పలు గ్రామాలలో వివిధ నీటి సరఫరా పథకాలకు 750 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వివిధ బ్యాంకర్లతో చర్చించి తాను త్వరలో ‘ లోన్ మేళా ‘ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పి సి ఈ ఓ సూర్య ప్రకాష్, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మెన్ జన్ను రాఘవరావు, ఏపి టిట్కొ సంస్థ డైరెక్టర్ చిన్నారి, పలువురు వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పిటీసీలు, ఎంపీపీలు, ఎంపిటీసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు