కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయి అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్’ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథక ప్రయోజనాలను వెల్లడించారు.
పీఎమ్ కేర్స్ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 351 మందిని అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శిరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల రూపాయలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇస్తున్న 50 వేల రూపాయలు ఆర్థిక సాయానికి పీఎం కేర్స్ నుంచి ఇచ్చేది అదనమని వెల్లడించారు. దీంతోపాటు పీఎం కేర్స్ కింద ఉన్నత విద్య అభ్యసించే అనాథలకు 50 వేల రూపాయలు, ఇంటర్మీడియట్‌కు 20 వేలరూపాయలు చొప్పున ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు.