దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవు.
2021–2022 ఆర్థిక సంవత్సరంలో అన్ని డినామినేషన్లకు సంబంధించిన దొంగ నోట్లు పెరిగిపోయాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నివేదికను విడుదల చేసింది. 500 నోట్లకు సంబంధించి 101.9 శాతం, 2000 నోట్లకు సంబంధించి 54.16 శాతం మేర దొంగ నోట్లు పెరిగాయని వెల్లడించింది. ఈ పరిస్థితిపై రిజర్వ్ బ్యాంకు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు నగదు చెలామణీ ఏటేటా పెరిగిపోతోందని ఆర్బీఐ పేర్కొంది. రూ.500 నోట్లకు సంబంధించి ప్రస్తుతం రూ.4,554.68 కోట్లు చెలామణీలో ఉన్నాయని, అదే అంతకు ముందు ఏడాది మార్చిలో చెలామణీలో ఉన్న 500 నోట్ల విలువ కేవలం రూ.3,867.90 అని పేర్కొంది.
నోట్లలో ఎక్కువగా 500దే హవా అని తెలిపింది. ఉన్న అన్ని నోట్లలో 500 నోట్లే 34.9 శాతం ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత 21.30 శాతంతో 10 నోట్లున్నాయని తెలిపింది. మరోవైపు 2000 నోట్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు నివేదిక వెల్లడించింది. 2020లో 274 కోట్ల నోట్లుండగా.. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య 214 కోట్లకు పడిపోయిందని పేర్కొంది.
దొంగనోట్లను ఇలా గుర్తుపట్టొచ్చు…
నోటును లైటు వెలుగులో చూస్తే ప్రత్యేకమైన ప్రాంతాల్లో 500 అని రాసి ఉంటుంది. అది లేకుంటే దొంగ నోటే. ఒరిజినల్ నోటు మీద దేవనాగరి లిపిలోనూ 500 అని రాసి ఉంటుంది. ఒరిజినల్ నోటు మీద మహాత్మా గాంధీ ఒరియెంటేషన్, రిలేటివ్ పొజిషన్ కూడా కుడివైపుకు ఉంటుంది. ఒరిజినల్ నోటైతే దాని మీద ఇండియా అని రాసి ఉంటుంది. నోటును వంచితే సెక్యూరిటీ హెడ్ కలర్ మారుతుంది. ఆకుపచ్చ నుంచి ముదురు వంగపండు రంగులో కనిపిస్తుంది. అది ఒరిజినల్ నోటు. ఇప్పుడున్న కరెన్సీ నోటుపై ఉన్న గవర్నర్ సంతకం, గ్యారంటీ క్లాజు, ప్రామిస్ క్లాజు, ఆర్బీఐ గుర్తులను నోటు కుడివైపునకు మార్చారు. నోటును అటు ఇటు కదిలిస్తే 500 అని రాసి ఉన్న అంకె రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది.