బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. జూలై 2, 3 తేదీల్లో నోవాటెల్ హోటల్ (హైటెక్స్ సమీపంలోని)లో కార్యవర్గ భేటీ నిర్వహించాలని జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో రెండ్రోజులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 40 మంది కేంద్ర మంత్రులు, 18 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు దాదాపు 400 మంది నగరంలోనే ఉండనున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని పార్టీ జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కీలక సమావేశాలను నిర్వహిస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలకు, సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌కు వెళ్లి పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు నోవాటెల్‌లో 270 గదులు కేటాయించారు. మరికొందరికి వెస్టిన్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎగ్జిక్యూటివ్ సూట్లు, ముఖ్యమంత్రులకు జూనియర్ సూట్లు కేటాయించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో 3న నిర్వహించే విజయ సంకల్పసభను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ బాధ్యతల్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీసుకున్నారు. మిగిలిన జిల్లాల నుంచి జనసమీకరణను బండి సంజయ్ భుజాన వేసుకున్నారు. కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే వారిలో 40 మందికి పైగా నాయకులు హైదరాబాద్‌కు చేరుకుని, తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు.
రాజ్‌భవన్‌లో ప్రధాని బస
కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనుండగా కేంద్ర మంత్రులు వివిధ స్టార్ హోటళ్లలో విడిది చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 500 దాకా గదులను ముందస్తుగా బుక్ చేసినట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా హాజరుకానుండటంతో వారికి విడిగా మీడియా సెంటర్, హోటళ్లలో బస తదితర ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికే అవకాశం.. కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికే ప్రవేశం ఉంటుందని తెలిసింది. తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డి.కె.అరుణ, వివేక్, జితేందర్‌రెడ్డి, రాజాసింగ్, గరికపాటి మోహన్‌రావు, లక్ష్మణ్, విజయశాంతి, ఆంధ్రప్రదేశ్ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు పాల్గొననున్నారు. భాజపా కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం ఇది రెండోసారి. 18 ఏళ్ల కిందట 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్.కె.ఆడ్వాణీ, పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎం.వెంకయ్యనాయుడుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే కీలక తీర్మానం జరిగింది. సంకల్పం-2004 నినాదంతో నాటి సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది.
నాటి, నేటి సమావేశాల మధ్య పలు సారూప్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పుడు, ఇప్పుడు కూడా బహిరంగసభకు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానమే వేదిక. నాడు కార్యవర్గ సమావేశాలు ట్యాంక్‌బండ్ సమీపంలోని వైస్రాయ్ హోటల్ (నేటి మారియట్)లో నిర్వహించగా, ఈసారి మాదాపూర్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేశారు. నాటి సమావేశాల్లో.. తెరాసతో ఎలాంటి పొత్తు ఉండదని భాజపా ప్రకటించింది. ఇప్పుడు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో భాజపాకు ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణపై భాజపా దృష్టి సారించింది. అప్పుడు, ఇప్పుడు కేంద్రంలో భాజపానే అధికారంలో ఉండడం విశేషం.
రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టి..
దేశవ్యాప్తంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రంతో సహా వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలను సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 8 ఏళ్ల మోదీ పాలన విజయాలు, పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్రాల్లో ప్రాంతీయ, కుటుంబ పార్టీలు అధికారంలో ఉండటంతో పెరుగుతున్న అవినీతి, నియంత పాలనను ప్రస్తావించనున్నారు. కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని వివరించనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు ఏర్పడితే లభించే ప్రయోజనాలు తెలియజేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు పాలన వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసి అటు పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.