అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలను (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్) తనిఖీ చేసి, కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు ఫుడ్ కంట్రోలర్, సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 జిల్లాలో అమలు జరుగుతున్న తీరుపై కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ నుండి ఫుడ్ సేఫ్టీ కంట్రోలింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, డిపిఓ తో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ తనిఖీలు నిర్వహించాలని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు బిఐఎస్ ప్రమాణాలను పాటించని, లైసెన్సులు లేకుండా అనధికారంగా నిర్వహిస్తున్న వాటిని మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతిరోజు ఫుడ్ సేఫ్టీ కంట్రోలింగ్ అధికారులు డైరీ ప్రొడక్ట్స్, హోటల్స్, రెస్టారెంట్, వాటర్ ప్లాంట్లు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు నెస్లే కంపెనీ ఆధ్వర్యంలో జూన్ మూడో వారంలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెస్టారెంట్లలలో ఆహారపదార్థాల తయారీకి వాడి మిగిలిపోయిన నూనెలలో బయో డీజిల్ తయారీదారులకు మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు రిజిస్ట్రేషన్ కోసం మేళాలు నిర్వహించాలన్నారు. పాలు, ఆయిల్, బియ్యం, గోధుమపిండి, ఉప్పు వంటి ఫోర్టిఫైడ్ ఆహార ఉత్పత్తుల అమ్మ కాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు.