దేశంలో ఇప్పుడు జరుగుతున్న అతి పెద్ద చర్చల్లో “ఉచిత పథకాల” చర్చ ఒకటి. ఈ ఉచిత పథకాల మీద దేశవ్యాప్తంగా ఒక వర్గం ప్రజలు తీవ్ర అసహనంతో ఉండగా, మరో వర్గం ప్రజలు వీటిని స్వాగతిస్తున్నారు. దీని మీద దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతుండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వాదనలో ప్రవేశించింది.
వివిధ రంగాలలో వెనుకపడిన వర్గాల వారిని మెరుగుపరచడం మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కి అందించే పథకాలను ‘ఉచితాలు’ అని పిలవడం మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ఆ విధంగా పేర్కొనడం సరికాదని అధికార వైఎస్సార్సీపీ బుధవారం సుప్రీం కోర్టు కు తెలియబరిచింది.అయితే రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఉచిత పథకాల కార్యక్రమాలు చేపట్టే పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఇంటర్వెన్షన్ పిటిషన్‌లో వైఎస్‌ఆర్‌సి సూచించింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేస్తున్న తీరును ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది “అశ్విని ఉపాధ్యాయ” దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జోక్యం చేసుకోవడానికి కోర్టు అనుమతి కోరుతూ రాజ్యసభ సభ్యుడు, అధికార వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాలు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించేలా అధికారాన్ని కల్పించే మార్గాలను సూచిస్తూ సుప్రీంకోర్టు ఒక కమిటీని సిఫారసు చేయాలని వైఎస్సార్సీపీ పేర్కొంది.
“మన దేశం సంక్షేమ రాజ్యమని, రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన సమానత్వ లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని” పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరోగ్యం మరియు విద్య అసమానతలు, గ్రామీణ మరియు పట్టణ అసమానతలను తగ్గించడం ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ పార్టీ అభిప్రాయపడింది.”ఈ లక్ష్యాలను సాధించడానికి, ప్రభుత్వాలు తప్పనిసరిగా గణనీయమైన ఖర్చులను భరించవలసి ఉంటుంది” అని అధికార పార్టీ పేర్కొంది. ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా పిటిషనర్ వాటిని “ఉచితాలుగా” సూచించడాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమలను అమలు చేస్తే వాటిని “ఉచితాలుగా” పేర్కొనాలని పేర్కొంది.
రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ప్రభుత్వాలకు గుదిబండలా మారిన ఈ “ఉచిత పథకాల” మీద మేధావులు పెదవి విరుస్తుండగా, ఈ పథకాల మీద ఆధారపడిన వైసీపీ పార్టీ లాంటి వారు మాత్రం ఇవి “ప్రజా సంక్షేమ పథకాలు” అంటూ సమర్దిస్తున్నాయి. అంతిమంగా సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుంది అని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.