భారతదేశ రాజకీయాల్లో పార్టీ విరాళాల మీద ఎప్పటినుండో చర్చలు సాగుతున్నాయి.ఇదివరకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి స్వచ్చందంగా విరాళాలు ఇచ్చేవారు. అలాగే అధికార పార్టీ నుండి లబ్దిపొందిన వారు కూడా వివిధ రూపాల్లో విరాళాలు ఇచ్చేవారు.అధికార పార్టీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి వ్యక్తులకు, సంస్థలకు లబ్ది చేకూరిస్తే విరాళాలను గిఫ్టులు గా పొందడం మీద అనేక మంది ప్రజాస్వామ్య వాదులు పోరాటం చేస్తూ వచ్చారు.ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీలు రహస్య మూలాల నుండి విరాళాలు అందుకుంటున్నాయి.
దేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) కీలక నివేదికను విడుదల చేసింది.2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు గుర్తు తెలియని మూలాల నుంచి రూ.15,077 కోట్లు రహస్య విరాళాల రూపంలో అందినట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఇలా రహస్య విరాళాలు అందినట్లు తెలిపింది. తన నివేదిక కోసం మొత్తం 8 జాతీయ పార్టీలు 27 ప్రాంతీయ పార్టీలను ADR పరిగణనలోకి తీసుకుంది. 2004-05, 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద సమర్పించిన ఆదాయపన్ను రిటర్నులు విరాళాలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని వెల్లడించింది.
పార్టీలవారీగా చూస్తే కాంగ్రెస్ తెలియని మూలాల నుంచి రూ. ₹178.782 కోట్లు పొందింది. అలాగే బీజేపీ రూ. ₹100.502 కోట్లు విరాళాలను గుర్తు తెలియని మూలాల నుంచి సేకరించింది. జాతీయ పార్టీల మొత్తం విరాళాల్లో 23.55% తెలియని మూలాల నుంచే రావడం గమనార్హం.
ప్రాంతీయ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రహస్య విరాళాలు పొందినవాటిలో వైఎస్సార్-కాంగ్రెస్ పార్టీ రూ. 96.2507 కోట్లతో టాప్ లో నిలిచింది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే రూ.80.02 కోట్లు బిజూ జనతాదళ్ (BJD) రూ.67 కోట్లు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన
(MNS) రూ. 5.773 కోట్లు ఆప్(AAP) రూ.5.4 కోట్లు పొందాయి.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది జాతీయ పార్టీలు గుర్తు తెలియని మూలాల నుంచి రూ.₹ 426.74 కోట్ల విరాళాల్ని పొందాయి. అలాగే 27 ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని మూలాల నుంచి రూ.₹ 263.928 కోట్ల విరాళాలను దక్కించుకున్నాయి.