రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పోలీసులను వాడుకుంటూ వారు ఎదుర్కొంటోన్న సమస్యలపై మాత్రం ఏమాత్రం దృష్టి సారించడంలేదని ఆక్షేపించారు. పోలీసులకు జీతాలు, రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
“పోలీసుల భద్రతా నిధి” పేరుతో తీసుకుంటున్న సొమ్మును ఏం చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పోలీసుల TA ని 14 నెలలుగా బకాయిలు పెట్టారన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరిన చిరుద్యోగులకు వేధింపులు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో కానిస్టేబుల్ హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు.
తమ సమస్యల గురించి అడిగిన చిన్న ఉద్యోగులను వేధించడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసు నిందితుల్లో ఇప్పటికీ ఒకరిని కూడా అరెస్టు చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సైతం సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులకు రావాల్సిన TA లు, సరెండర్ మొత్తాల్ని సకాలంలో అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాల్లో చెబుతున్న మాటలు వాస్తవంలో అమలు కావడంలేదని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు.అసలు పోలీసు భద్రత కోసం జీతాల నుంచి మినహాయించిన డబ్బు భద్రంగా ఉందా అని నిలదీశారు. జమ చేసుకున్న ఆ మొత్తాన్ని ఏం చేశారో పాలకులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ సిబ్బంది నెలల తరబడి పేరుకుపోయిన బకాయిలతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
పోలీసులకు అందాల్సిన భత్యాలు…
రుణాలను ఎందుకు నిలిపివేస్తున్నారు? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/2iDyONcUS2— JanaSena Party (@JanaSenaParty) September 20, 2022