ఒక్క స్థానం పోయినా ఫర్వాలేదు అనుకుంటే ఆ సంఖ్య 10 అవుతుందని,175 స్థానాలు గెలవాలనుకోవటం అత్యాశ కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాఖాపరమైన సమీక్షలు జరిపినట్లే పార్టీ పరంగా సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి లోటు పాట్లు చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వారసుల ఎంట్రీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వారసులు అందరికీ ఉంటారని తనకూ కుమారుడు ఉన్నారని గుర్తు చేశారు. ఎవరైనా వారసుల్ని ఎన్నికల బరిలోకి దింపొచ్చు కానీ ప్రజలు ఆమోదించాలి కదా అన్నారు.
రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ లక్ష్యమన్నారు బొత్స. గడప గడపకూ ఎమ్మెల్యేలంతా వెళ్లాల్సిందేనని సీఎం జగన్ ఒకింత గట్టిగా చెప్పిన మాట వాస్తవమేనన్నారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడు ఎన్నికపై తనకు సమాచారం లేదని తమ పార్టీ విషయాలు తాము మాట్లాడుకుంటామన్నారు,అవి మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపేనని అదే విషయం ముఖ్యమంత్రి అందరికీ గట్టిగా చెప్పారన్నారు.