ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అయింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్ఆర్సిపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ ఆర్థిక కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఏపీ భవన్ లో అధికారులు, నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సిన ప్రాజెక్టులు, వివిధ శాఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర బకాయిల గురించి సమగ్ర నివేదికను సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదమే ప్రధాన ఎజెండా కానుంది. టెక్నికల్ అడ్వైసర్ కమిటీ నిర్ణయించిన రూ.55,548.87 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో కాంపోనెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన సొమ్మును వాపసు చేసే విధానాన్ని నిలిపివేయాలని,దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని, జరుగుతున్న పనిని వెంటనే రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. వెంటనే 2,900 కోట్లు విడుదల చేయాలని కోరారు. మరోవైపు, వనరులలేని రాష్ట్రం కారణంగా రూ. 32,625.25 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి విడుదల చేయాలని,వీటితో పాటు వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆర్థిక సహాయం, వివిధ ప్రాజెక్టులకు నిధుల మంజూరు తదితర అంశాలను కూడా ప్రస్తావించారు.
There's a considerable progress b/w 1st & 2nd meetings with Finance Ministry; overborrowings by former Chandrababu Naidu govt have to be regularized, pending dues – Rs 6,600 crores from the Telangana govt have to be cleared: YSRCP MP Vijayasai Reddy (25.08) pic.twitter.com/PlF1uaAKRr
— ANI (@ANI) August 25, 2022