ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పరిపాలన ఎందుకని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి పది స్థానాల్లో ఉందని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(NCRB) లెక్కలు చెబుతున్నా ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దిశ చట్టం తీసుకొచ్చాం,దిశా పోలీస్ స్టేషన్లు పెట్టామని వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేసుకుంటుందే తప్ప ఆడబిడ్డలకు ధైర్యం ఇవ్వలేకపోతుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారని అన్నారు. ఈ ఘటనలు చూసి రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకీ పెరగటం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/S6L0tNnYOd
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2022
అచ్యుతాపురం సెజ్‌లో ఉపాధి కోసం వచ్చిన మహిళపై, నాగార్జున సాగర్ దగ్గర ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న గిరిజన మహిళపైన చోటు చేసుకున్న అత్యాచారం, హత్య ఘటనలు ఎంతో బాధించాయని పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళల మానమర్యాదలకు భంగం కలిగించే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతోనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని విమర్శించారు.