రాష్ట్రంలోని అరాచక పరిస్థితుల మీద ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీసులు కొడితే అదే వారికి చివరిరోజని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే అధికార పార్టీకి కొమ్ము కాసి తప్పు చేస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు మొదలుపెట్టామని పేర్కొన్నారు. న్యాయం జరగటానికి సమయం పట్టొచ్చు కానీ తప్పు చేసిన పోలీసుల్ని శిక్షించకుండా వదలమని హెచ్చరించారు. శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకుని మనల్ని భయపెట్టాలని చూసేవారికి ఖబడ్దార్ చెప్పాల్సిందేనన్నారు. రాజకీయ ముసుగులో వచ్చే కరుడుగట్టిన నేరస్థులకి గట్టి గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. పోలీసులపై మనకు ఎలాంటి వ్యక్తిగత పోరాటం లేదన్న చంద్రబాబు అధికారపార్టీ నేతల ఒత్తిడికి లొంగి అపహాస్యం చేసే కొందరు పోలీసులపైనే మన పోరాటమని తెలిపారు.
అక్రమాలు, అన్యాయాలు చేసే వాళ్లకు రిటర్న్ గిఫ్ట్లు సిద్ధం చేస్తున్నామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. దేశాలు దాటి పారిపోయేందుకు ఇప్పుడే వీసాలు సిద్ధం చేసుకోండని హెచ్చరిక జారీ చేశారు. అక్రమ పాలనకు కొమ్ముకాస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ల లిస్టు సిద్ధం చేస్తున్నామన్నారు. తెదేపా కార్యకర్తలు ఒక్కసారి రోడ్డెక్కితే ఎవరైనా తోకముడవాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కనుసైగ చేస్తే శ్రేణుల సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు.