కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఇప్పుడు అనేక లేనిపోని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం శ్రీ వారి భక్తులను కలచివేస్తుంది.ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం కొన్ని వేల మంది మంది భక్తులు వస్తుంటారు. ఒక్క రోజులో లక్ష మంది భక్తులు దర్శించుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వీరిందరికీ సేవలు అందించడానికి స్వామి వారి సేవలకు సంబంధించిన కార్యకలాపాలు దేవస్థానం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా ఉంది. దీనికి ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేస్తుంటారు. ఇంకా టీటీడీ చైర్మన్ వివిధ విభాగాలకు సంబంధించి వేల మంది సిబ్బంది కూడా ఉన్నారు.
భక్తులకు కావాల్సిన అవసరాలు, సౌకర్యాలపైన దృష్టిపెట్టాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనవసర వివాదాల్లో తలదూరుస్తోందని భక్తులు విమర్శిస్తున్నారు. తిరుమల కొండల మీద ఏడుకొండలవాడి నామ తప్ప మరేదీ వినపడకూడదు. కానీ నిత్యం అనేక వివాదాలు తెచ్చిపెట్టే వాటిని సరి చేసుకోలేక టీటీడీ నానా తంటాలు పడుతుంది.తాజాగా సినీ నటి అర్చనా వ్యవహారం దీనికి ఒక ఉదాహరణ.
ఇదే కాకుండా కొండపైన పలుమార్లు అన్యమత ప్రచారం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పలుమార్లు శ్రీవారి భక్తులు అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులను పట్టుకుని అధికారులకు కూడా అప్పగించారు. వాస్తవానికి టీటీడీలో పనిచేసేవారిలో పెద్ద మొత్తంలోనే అన్య మతస్తులు ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్ర భక్తుడు ఛత్రపతి శివాజీ విగ్రహంతో కార్ లో వచ్చినప్పుడు ఆ విగ్రహం గురించి టీటీడీ సిబ్బంది ఓవర్ యాక్షన్ మహారాష్ట్రలో పెద్ద దుమారాన్ని రేపింది.మహారాష్ట్రీయులు టీటీడీపైన భగ్గుమన్నారు.టీటీడీ నష్టనివారణ చర్యలుగా మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు తిరుమలలో సన్మానం చేసి ఛత్రపతి శివాజీ అంటే తమకు గౌరవముందని ప్రకటించాల్సి వచ్చింది.
ఇప్పుడు నటి అర్చన విషయం కూడా తెగే దాకా టీటీడీ లాగుతుంది. కొండ మీద భక్తుల సౌకర్యాలు చూడాల్సిన వారు ఇలాంటి అనవసర విషయాల్లో తల దూర్చి శ్రీ వారి భక్తులను అవమానిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి నియమ నిబంధనలు తమ పార్టీ వారికి ఒకలా మరొకరికి మరోలా కాకుండా చూసి శ్రీ వారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించాలని అందరూ కోరుకుంటున్నారు.