జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఏకైక రాజధాని అమరావతి మీద వారు, వారి పార్టీ నాయకులు ఏదో విధంగా విమర్శిస్తూ వచ్చారు. అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అమరావతిని ఉనికిని తగ్గించడానికి ఎక్కడ లేని ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. ఒకపక్క భూములు ఇచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ అసెంబ్లీలో అభివృద్ది వికేంద్రీకరణ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైతులేమో న్యాయం కోసం దేవాలయాల చుట్టూ, కోర్టులను నమ్ముకొని తిరుగుతున్నారు. న్యాయస్థానం నుండి దేవస్థానం అని పాదయాత్ర చేశారు. ఇప్పుడు అమరావతి టు అరసవల్లి అంటూ మహా పాదయాత్ర చేపట్టారు. ఇదే సమయంలో జగన్ సర్కార్ కావాలని అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటును తెర మీదకు తీసుకొని వచ్చి, అమరావతి పల్లెల్లో అభిప్రాయ సేకరణ ప్రారంభించింది.
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను అమరావతి ప్రాంతంలో మరో మూడు గ్రామాలు వ్యతిరేకించాయి. మంగళగిరి మండలం కురగల్లు, తుళ్లూరు మండలం నెక్కల్లు, అనంతవరం గ్రామస్థులు అమరావతి మున్సిపాలిటీ తమకు ఏమాత్రం అంగీకారం కాదని తేల్చచెప్పారు. ఈ మేరకు అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతికేకంగా చేతులెత్తారు. నెక్కల్లులో మాత్రం ఒక్కరంటే ఒక్కరు మున్సిపాలిటీకి అనుకూలమని చెప్పారు. రాజధానికి ఇచ్చిన భూములు అభివృద్ధి చేయాలని, మాస్టర్ ప్లాన్ మారిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు.