జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకైక రాజధాని అమరావతి మీద ఎన్ని వ్యతిరేక నిర్ణయాలకు వెళదాం అని చూసినా అన్ని కూడా బెడిసి కొడుతున్నాయి. కోర్టులు గానీ, ప్రజలు గానీ అమరావతి మీద తీసుకొనే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాక్షాత్తు సీఎం ఇచ్చిన మద్దతుగా ప్రజల నుండి స్పందన లేదు. అలాగే మహా పాదయాత్ర సమయంలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును కూడా ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు.
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకించే గ్రామాల జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. మున్సిపాలిటీ ఏర్పాటును స్వాగతించేందుకు ఒక్క గ్రామమూ ముందుకు రావడం లేదు. తాజాగా ఈ రోజు మరో 3 గ్రామాలు ప్రభుత్వ ప్రతిపాదనను ఏకపక్షంగా తిరస్కరించాయి. అధికారులు నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న కృష్ణాయపాలెం, వెలగపూడి, మల్కాపురం వాసులు మున్సిపాలిటీకి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. 29 గ్రామాల సంపూర్ణ అమరావతి తప్ప దేనీకీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం వెలగపూడి, మల్కాపురంలో అధికారులు ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలపడంలో విఫలమైనందున గ్రామసభలో మున్సిపాలిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేతులెత్తేమని స్థానికులు వెల్లడించారు. తమకు 29 గ్రామాల సంపూర్ణ అమరావతి కావాలని మున్సిపాలిటీ వద్దని ప్రజలు కోరారు. తమ సందేహాలను నివృత్తి చేసిన తర్వాతే మళ్లీ గ్రామ సభ నిర్వహించాలని అధికారులకు వినతిపత్రం కూడా అందించారు.