వైద్యఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో లైనాక్ మెషీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 7 వైద్యకళాశాలల్లో క్యాన్సర్ శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ ధియేటర్ల ఆధునీకరణ నిమిత్తం సీఎం ఆమోదం తెలిపారు.క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైద్యకళాశాలలు, కొత్తగా మెడికల్ కాలేజీల్లో ప్రత్యేక క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో 12 రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యతపై ప్రతినెలా నివేదికలు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. రక్తహీనత నివారణపై దృష్టి నిలపాలని కోరారు. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జిల్లాలో వైద్య కార్యకలాపాల కేంద్రంగా బోధనాస్పత్రులు ఉండాలి. విలేజ్ క్లినిక్స్ సహా ప్రతి ఆస్పత్రి బోధనాస్పత్రి పరిధిలోకి రావాలి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి జిల్లాల్లో అధికారిని నియమించాలి. రక్తహీనత నివారణపై దృష్టి సారించాలి. అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరును పర్యవేక్షించాలి అని అధికారులకు దిశా నిర్దేశనం చేశారు.