చిత్తూరు సబ్ జైల్ లో ఉన్న కుప్పం నాయకులను చంద్రబాబు పరామర్శించారు,అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి రోజులు దగ్గర పడ్డాయని అందుకే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వైఎస్ఆర్సీపీ రోజు రోజుకు ప్రజా ఆదరణ కోల్పోతుందని, అందుకే భయపడి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ తప్పు చేయలేదని ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడిన కార్యకర్తలను జైల్లో పెట్టడం బాధాకరమన్నారు.
పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని, పోలీసులు తమ తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో పోలీసులు దోషులుగా నిలబడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జైలు వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మాజీ మేయర్ కటారి హేమలత నివాసం చేరుకొని పరామర్శించారు.
టిడిపి నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడి జైలు కెళ్లారు. – @ncbn pic.twitter.com/qrPC6DIbbP
— Telugu Desam Party (@JaiTDP) September 20, 2022
అక్రమ కేసులకు భయపడే ప్రశ్నే లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు టీడీపీని ఏం చేయలేవన్నారు. చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారుల ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ జైలుకు వెళ్లి పరామర్శించలేదన్నారు. ఇవాళ జైలులో ఉన్న ఎనిమిది మంది కార్యకర్తల్ని పరామర్శించాల్సి వచ్చిందన్నారు.కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ నేతలను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. కొందరు పోలీసులు బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనే కాదు, పులివెందులలో కూడా గెలుస్తామన్నారు. పోలవరం, అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు.






