పథకాలు అందడం లేదన్నందుకు ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడటంతో పాటు చేతిలో ఉన్న పుస్తకాన్ని వారిపైకి విసిరికొట్టడం ఏపీ లో పరిస్థితి ఏంటన్నది తెలుపుతోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు తమకు అందడం లేదని చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు బనాయిస్తున్నారని టీడీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి రాత్రంతా జైల్లో ఉంచారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంటలో ఈ సంఘటన జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు లింగంగుంట పంచాయతీ పరిధి బెజవాడవారిపాలెంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పర్యటించారు. ఆటోడ్రైవర్ చల్లా వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏమీ అందలేదని, వైసీపీ ప్రభుత్వంలో పేదలకు పథకాలు పూర్తి స్థాయిలో అమలుచేశామన్నారు. అయితే టీడీపీ సానుభూతిపరుడైన వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే మాటలకు అభ్యంతరం తెలిపాడు.
గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని పథకాలు తమకు అందాయని, ప్రస్తుతం ఏమీ రావడం లేదని చెప్పాడు. వెంకటేశ్వర్లు మాటలు విన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లుతో మాటామాటా పెరగడంతో ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని వారి మీదకు విసిరికొట్టారు. తమ ఇంటికి వచ్చి ఇలా చేయడం ఏంటని వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు విజయ భాస్కర్ తనను కులం పేరుతో దూషించారంటూ మేళం శ్రీకాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లును, విజయ భాస్కర్‌ను పోలీసులు తీసుకెళ్లి, రాత్రంతా స్టేషన్‌లో ఉంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.