ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎత్తున ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద దాదాపు 53.60 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో భద్రాచలం సబ్ కలెక్టరు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 12.430 మీటర్ల నీటిమట్టం నమోదయ్యింది. అక్కడి నుంచి రాజమహేం ద్రవరంలోని కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇక్కడి జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ నుంచి 7.45 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 10.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. రాజమహేంద్రవరంలోని పాత బ్రిడ్జి వద్ద 13.75 మీటర్లు నీటి మట్టం ఉంది. వరద ఉధృతి గంట గంటకూ పెరగడంతో అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టారు.
పొంచి ఉన్న ప్రమాదం
అంబేద్కర్‌కోనసీమ జిల్లాలో నాగుల్లంక, తొండవరం, వాకలగరువు గట్లకూ ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు భారీ ఎత్తున వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి చేరడంతో ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళదీస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల ఎత్తున నీటిమట్టం చేరితే దిగువకు 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడు దల చేసి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కోనసీమ జిల్లాల్లో 7 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 13.75 అడుగులకు చేరితే 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఫలితంగా 13 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. అదే బ్యారేజీ వద్ద 17.75 అడుగులకు నీటిమట్టం చేరితే 17 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో 12 గ్రామాలపై ప్రభావం ఉండ బోతోందని అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి కారణంగా తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణాల్లోని పలు ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాగు భూములు ముంపునకు గురయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12.6 ఎంఎం సగటు వర్షపాతం నమోదయ్యింది.
అధికారుల పరిశీలన
గోదావరికి వరద ఉధృతంగా వున్న దృష్ట్యా అల్లవరం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల్లో ముంపునకు గురైయే ప్రాంతాల్లో అమలాపురం ఆర్‌డిఒ వసంత రాయుడు పర్యటించి స్థానిక ప్రజలు, అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన అద్దంకివారిలంక, కేదార్లంక, నారాయణ లంక గ్రామాల్లో సోమవారం రామచంద్రపురం ఆర్‌డిఒ సింధు సుబ్రహ్మణ్యం పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించారు. ఆత్రేయపురం, ఆలమూరు, కాట్రేనికోన మండలాల్లో అధికారులు వరద పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు కు కాట్రేనికోన మండల పరిధిలోని చిలకమ్మ చెరువు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో మూడు కొబ్బరి చెట్లపై పిడుగులు పడి దగ్ధమయ్యాయి. ఎడతెరపిలేని వర్షాలకు కోటిపల్లి రేవులో ప్రయాణాలు నిలిచిపోయాయి. రేవులో తిరిగే పంట్లు పడవలు ఒడ్డుకు చేరుకున్నాయి. పరిస్థితిని కె.గంగవరం తహసిల్దార్ శర్మ సమీక్షించారు. అదే విధంగా వర్షం కారణంగా రైతులు వేసుకున్న తొలకరి ఆకుమడులు నీట మునిగిపోయాయి.
వర్షాలు, వరదలతో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కృతిక శుక్లా
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పూర్తి అప్రమత్తతతో ఉన్నామని ప్రతి మండలంలోనూ ప్రత్యేక అధికారి నేతృత్వంలోని బృందాలు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని పారిశుద్ధ్య కార్యక్రమాలకు అవసరమయ్యే బ్లీచింగ్, లైమ్, ఫినాయిల్ వంటివాటి కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీలను సమీప ఆసుపత్రిలో చేర్చి, అవసరమైన సేవలు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్ప ఘాట్ వద్ద సుమారు 56 అడుగులకి చేరుకున్న నీటిమట్టం చేరింది.. కోటిలింగాల ఘాట్ శంకర్ ఘాట్ దుర్గా ఘాట్ గణపతి ఘాట్ మార్కండేయ ఘాట్, కుమారిఘాట్ ఇస్కాన్ ఘాట్ గాయత్రి ఘాట్ విఐపి ఘాట్ అన్ని ఘాట్ లో పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. అదే విధంగా గోదావరి నదికి లంక భూముల్లో నివాసం ఉండి జీవనం సాగించే చాపలు వేటగాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.
వరద ప్రభావం పై సమీక్ష -జిల్లా కలెక్టర్ మాధవిలత
భక్తులను స్థాన ఘట్టాల్లో నదీ పరివాహ ప్రాంతాల్లో దిగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ముఖ్య ఘాట్ లను, ధవలేశ్వరం కాటన్ బ్యారేజి ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, IPS. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతు మూడోవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నా నేపథ్యంలో, అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, IPS., వారు గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి, సామాన్య ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించి, నదీ పరివాహక ప్రాంతాలలో మరియు గోదావరి లంకలలో నివసించే ప్రజల రక్షణ దృశ్య ప్రత్యేక ఏర్పాట్లు, బందోబస్తును ఏర్పాటు చేసి, జిల్లా నందు ముఖ్య ఘాట్ లను, పుష్కర ఘాట్, దవిళేశ్వరం కాటన్ బ్యారేజి ను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించిన పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టవలసిన/తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ తగు సూచనలు/ఆదేశాలను జారీ చేసి అప్రమత్తం చేశారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
ఏలూరు జిల్లాలో గత 24 గంటల్లో 38.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అత్యధికంగా లింగపాలెం మండలంలో 70.2 మి.మి. వర్షపాతం నమోదు కాగా పెదవేగి మండలం లో 12.4 మిమి నమోదైందన్నారు.చింతలపూడి లో 69.2 మిమీ, కొయ్యలగూడెం లో 66.6, చాట్రయిలో 63.2,వేలేరుపాడు లో 58.2, నూ జివీడులో 57.6,కుకూనూర్ లో 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు,వరదలు నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే విధంగా 1800 233 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఎమైన సాయం కావాల్సిన ప్రజలు తప్పక వినియోగించుకోవలన్నరు గోదావరి పరివాక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు మూలంగా గోదావరి వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో నది పరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండంతో పాటు పశువులు,గొర్రెలు,మేకలను మేతకు తీసుకువెళ్లకుండ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాగులు,వంకలు వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలవరం
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్లు ఎత్తారు. 2 .32 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదవుతున్నాయని గేట్ల పర్యవేక్షణ ఈఈ చెప్పారు.స్పిల్‌వే వద్ద నీటిమట్టం 28 మీటర్లకు పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 1.20లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు.నదీ తీర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.ఆదివారం రాత్రికి భద్రాద్రి వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని సిడబ్ల్యుసి వెల్లడించింది.
చింతలపూడి(మం) నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు జలాశయం కు వరద నీరు చేరుతున్నది.జలాశయం సామర్ధ్యం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 332 అడుగులు వుంది.ప్రస్తుతం ఇన్ ఫ్లో 100 క్యూసెక్లు.
ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 42 వేల క్యూసెక్కులు
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలువాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజికి కూడా వరద ప్రవాహనం కొనసాగుతోంది. 42 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజికి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజి 50 గేట్లను ఒక అడుగు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో ఐదు వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు బ్యారేజి ఇఇ పివిఆర్ కృష్ణ తెలిపారు. ఈ ప్రవాహం ప్రస్తుతం యధావిధిగా కొనసాగుతోందని వివరించారు. బ్యారేజి నీటి మట్టం ప్రస్తుతం 12 అడుగులుగా ఉంది.
కీసర బ్రిడ్జి వద్ద 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మునేరుకు భారీగా వరద నీరు చేరింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వైరా ఏరు, కట్టలేరు, మునేరుకు వరద నీరు చేరింది. గత నాలుగు రోజులుగా మునేరుకు వరద ప్రవాహం పెరిగింది. కీసర బ్రిడ్జి వద్ద 35 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు ప్రవహిస్తున్నట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మునేరుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మునేరు నుంచి వరద కంచికచర్ల మండలం మోగులూరు సమీపంలో కృష్ణానదిలోకి చేరుతోంది. ఈ ఏడాది మునేరుకు తొలకరి వానలతోనే వరద రావటంతో తీర గ్రామాల్లో రైతులు మాగాణి, మెట్ట పంటలకు ఢోకా ఉండదని అంటున్నారు. కృష్ణానదికి కూడా వరద రావటంతో తీర గ్రామాల రైతాంగం మాగాణి పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. మునేరుతోపాటు కృష్ణానదికి వరద రావటంతో తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వైరా ఏరు, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు ఏరులు కలిసే దాములూరులోని కూడలి సంగమ వద్ద వరదనీరు బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరులపాడుకు చెందిన 15 గ్రామాల ప్రజలు నందిగామ రావాలంటే ఈ బ్రిడ్జి ఆధారంగా ఉంది. వర్షాకాలంలో తరచూ వచ్చే వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఓ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా పూర్తవుతుందన్న ఆశలో ప్రజలు ఉన్నారు. ఇది పూర్తయితే 40 నుండి 50 కిలోమీటర్లు తిరిగి వచ్చే పని ఉండదు. వత్సవాయి : లింగాల కాజ్వే వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది.
తెలంగాణా రాష్ట్ర వరంగల్ జిల్లా పాకాల చెరువు నుంచి వస్తున్న వరద నీరు ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహించడంతో వత్సవాయి మండలం పోలంపల్లి రాజీవ్ మునేరు చెక్ డాం నిండిపోయింది. చెక్ డ్యాం వద్ద 15 అడుగుల మేర నీరు చేరింది. దిగువకు వచ్చే వరద నీరు లింగాల బ్రిడ్జికి దిగువగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థితిలోనే వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ వరద ఉధతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నీటితో జలకళ లాడుతున్నాయి. మునేరు ఆయకట్టు కింద ఉన్న రైతులు నారు మడులకు సన్నద్ధమవుతున్నారు. లింగాల, చిల్లకల్లు పైలెట్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరింది.
విద్యుత్ శాఖ హెచ్చరికలు
విద్యుత్ వినియోగదారులకు గ్రామ ప్రజలకు అప్రమత్తం గా ఉండాలని A.P.C.P.D.C.L. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు రోజులు నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల, గాలులు, వల్ల రైతులకు సంబంధించి కొందరివి కరెంట్ మోటార్లు మునిగి వుంటాయి.. అంతే కాకుండా స్టార్టర్స్, డబ్బాలు తడిసివుంటాయి. సర్వీసెస్ వైర్స్ డామేజెస్, అవుతాయి. స్తంబాలు పడిపోవచ్చు, వైర్స్ తెగిపోవచ్చు,కావున వాటిని ముట్టుకొనే ప్రయత్నం కాని, దగ్గరకు వెళ్లే ప్రయత్నం కాని చేయకండి. ఆక్వా రైతులు, ఏరియేటర్స్ ను ముట్టుకోనరాదు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ ఇంటికి సంబందించిన సర్వీస్ వైర్లని కాని, వాటితో వెలాడే ఇనుప తీగలను కానీ, కరెంట్ స్తంభాలను కానీ,ఇనుప స్తంభాలను కానీ, లైన్స్ మీద చెట్టు కొమ్మలు పడిన కానీ, ముట్టుకొనే ప్రయత్నం చేయకండి. తడిచేతులతో ఇంట్లోని స్విచ్ బోర్డులను ముట్టుకోకండి. విద్యుత్ షాక్ తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది… దయచేసి విద్యుత్ షాక్ తో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడండి. కావున ఏదైనా విద్యుత్ సమస్య వుంటే,తీగలు తెగి ఉన్న, పోల్స్ పడిపోయిన వెంటనే ,మీ లోకల్, లైనయిన్స్పెక్టర్ కు కానీ లైన్ మాన్ కు కానీ, సబ్ స్టేషన్స్ కు కానీ,ఏఈ దృష్టికి కానీ, 1912 కు కానీ తెలియజేయండి. దయచేసి ముట్టుకొకండి అని తెలిపారు.
తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు జిల్లాల కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు.