ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెర మీదకు వచ్చారు. రావడమే కాదు సవాళ్లు విసురుతున్నారు. చూడబోతే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఐసీయు లో ఉన్న కాంగ్రెస్ ప్రధాన పోటీలోకి వచ్చి తిరిగి జీవం పొందేలా కనిపిస్తుంది.విషయంలోకి వెళితే ఏపీ రాజకీయాల్లో అమరావతి, మూడు రాజధానుల అంశం కాక రేపుతుంది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో అమరావతి రైతులకు మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాదయాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రేణుకను మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్ చేశారు. కార్పొరేటర్‌గా కూడా గెలవని వ్యక్తి అంటూ అసెంబ్లీ లో కామెంట్ చేయగా,రేణుకా చౌదరి ఓ ఇంటర్వ్యూలో నానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
కొడాలి నాని రాజకీయాల్లోకి రాకముందే తాను కార్పొరేటర్ అంటూ కొంచెం ఘాటుగానే స్పందించారు. ‘బుజ్జీ నీకు చరిత్ర తెలియదు, రాజీవ్ గాంధీ ఇచ్చిన మొబైల్‌లో గూగుల్ లో కొట్టు రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మంత్రి కదా నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి నాకు బొచ్చెడు పబ్లిసిటీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చాడు. ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది’అని రేణుకా చౌదరి అన్నారు.
ఇంకా రేణుకా చౌదరి మాట్లాడుతూ తాను టీడీపీకి మద్దతుగా లేనని ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడి తనకు మంచి ఐడియా ఇచ్చారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానని,తాను మున్సిపల్ కార్పొరేటర్‌గా చేశా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేశానన్నారు. ఎమ్మెల్యేగా ఎప్పుడూ చేయలేదని గుడివాడలో పోటీ చేస్తే తానే గెలుస్తాను అన్నారు. కొడాలి నానిని ఎవరూ మళ్లీ ఎన్నుకోరని ఎక్కడ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తాను అన్నారు. కొడాలి నాని వచ్చి ఇక్కడ గల్లీల్లో తిరిగి చూస్తే తానేంటో తెలుస్తుందన్నారు. రేణుకా చౌదరి వైసీపీ ఫైర్ స్టార్ కొడాలి కి కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.