టీటీడీ అర్చకులంతా వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును అమలు చేస్తామనే సీఎం జగన్ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ నిరాశే ఎదురయిందని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ తిరుమల పర్యటన ముగించి కర్నూలుకు వెళ్లిన తర్వాత రమణదీక్షితులు తన అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీలో ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక శక్తుల వల్ల అర్చక వ్యవస్థ, ఆలయ ప్రతిష్ట కోసం మకుందుగా వన్ మ్యాన్ కమిటీని అమలు చేసేలా ప్రకటన చేయాల్సి ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితులు పింక్ డైమండ్ పోయింది అని ఆరోపణలు చేయడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించింది. దాని మీద ఆయన న్యాయపోరాటం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్‌నూ కలిసి తమ ప్రభుత్వం వస్తే మళ్లీ ప్రధాన అర్చకులుగా నియమిస్తామనే భరోసా పొందారు. జగన్ సీఎం అయిన తర్వాత తిరిగి ప్రధాన అర్చక హోదా పదవి పొందాలని రమణదీక్షితులు ప్రయత్నిస్తున్నారు. అయితే చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో సాధ్యం కాలేదు. చివరకు వన్ మ్యాన్ కమిటీ సిఫార్సుల ద్వారా మళ్లీ ప్రధాన అర్చకులుగా రావాలనుకుంటున్నారు. టీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు సిఫార్సులు చేయాలని వన్ మ్యాన్ కమిటీకి ప్రభుత్వం చెప్పడంతో ఆ కమిటీ రిపోర్టుతో మళ్లీ పాత బాద్యతలు వస్తాయని రమణదీక్షితులు ఆశతో ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని గత ఏడాది జూలైలో జగన్ ప్రభుత్వం నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది.హైకోర్టు విశ్రాంత జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యయనం చేసి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది జగన్ ప్రభుత్వం. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు తెలిపింది. ఆ కమిటీ రిపోర్టు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ విషయంపైనే రమణదీక్షితులు అసంతృప్తికి గురయ్యారు.