14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు సరైన ప్రణాళిక లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి భారీ నష్టం మిగిల్చారని పోలవరం బహుళార్థక ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన కనీసం ఎమ్మెల్యేగా ఉండేందుకు కూడా పనికిరారని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం విమర్శించారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలవరం నిర్మాణం ఆలస్యమవుతోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. పోలవరం నిర్మాణానికి 2011 ధరల ప్రకారం 2016లో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని అప్పటి చంద్రబాబు సర్కారు గుడ్డిగా అంగీకరించడం వల్ల ఇప్పుడు ఆర్థిక సాయం పెంచమని తాము కోరుతున్నా ఫలితం లేకుండా పోతోందని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు మూర్ఖత్వం వల్ల చివరకు పోలవరం నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2900 కోట్లు కూడా కేంద్రం తిరిగివ్వడం లేదని సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులను స్లైడ్ షో ద్వారా ప్రదర్శించి చూపించిన సీఎం జగన్ చంద్రబాబు చేసిన నష్టాన్ని పూడ్చేపనిలో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. రెండు కాఫర్ డ్యామ్‌లలో భారీ ఖాళీలు ఉండటం, స్పిల్ వేను అసంపూర్తిగా వదిలేయడంతో ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని సీఎం జగన్ తెలిపారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని సరి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోందన్నారు. 41.15 మీటర్ల కాంటూరు స్థాయి వరకూ నిర్వాసితులకు అదనపు సాయం అందిస్తామని ప్రకటించిన సీఎం జగన్ అందుకు అవసరమయ్యే 500 కోట్లు రూపాయలు తమకో లెక్క కాదన్నారు. తాను వివిధ పథకాల కోసం వేల కోట్లు బటన్ నొక్కి పంపిణీ చేస్తున్నానని గుర్తు చేసిన సీఎం జగన్ నిర్వాసితుల అదనపు పరిహారం కోసం గతేడాది జూన్‌లో జీవో కూడా ఇచ్చామని సీఎం చెప్పారు






