విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ఎన్టీఆర్ స్థానంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు, టీడీపీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా, ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో నిర్వహించిన బీజేపీ ప్రజాపోరు యాత్రలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్‌ని గౌరవిస్తున్నామని అసెంబ్లీలో చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బయట తీవ్రంగా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ నేతల స్వలాభం దెబ్బకు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా రాష్ట్రం నుంచి పోవడానికి సిద్ధమయ్యాయని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో పేదలకు కేంద్రం ఇళ్లు మంజూరు చేస్తే, జగనన్న కాలనీగా ఈ సీఎం పేరు మార్చుకుంటున్నారని పురందరేశ్వరి అన్నారు.
ఎన్టీఆర్ డాక్టర్ కాదు కాబట్టే ఆయన పేరు తొలగిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి విచక్షణతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ సామాజిక డాక్టర్ అనే విషయాన్ని మరచిపోకూడదని చురకలంటించారు. సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని వైద్య విద్యను ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న సదుద్దేశంతోనే ఎన్టీఆర్ ఈ వర్సిటీని ఏర్పాటు చేశారని ఆమె గుర్తుచేశారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగిస్తే నేటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.