అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో మహిళలు, రైతుల రథానికి బిందెలతో వారబోసి స్వాగతం పలికారు. వంగాయగూడెంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా యాత్రలో పాల్గొన్నారు. శాంతి కపోతాలు ఎగరేసి అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
ఏలూరు జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ రైతులూ అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పది మంది రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. పాలకులకు ధైర్యం ఉంటే 3 రాజధానుల అజెండాతో ఎన్నికలకు సిద్ధం కావాలని అమరావతి ఐకాస నేతలు సవాల్ విసిరారు. పాదయాత్రకు స్పందన ఓర్వలేకే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేడు కొవ్వలి నుంచి శ్రీరామవరం మీదుగా పెరుగుగూడెం వరకు యాత్ర కొనసాగుతుందని ఐకాస నేతలు వెల్లడించారు .
పాలగూడెం, కొమడవోలు, మల్కాపురంలో యాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. మహిళలు మంగళ హారతులు పట్టారు. కొవ్వలిలో స్థానికులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని భారీ గజమాలను రాజధాని రైతుల రథానికి సమర్పించారు.