కేంద్ర హోం శాఖ.. కారాగార గణాంక నివేదిక – 2021ని విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వివిధ కేసుల్లో గతేడాది (2021)లో ఏకంగా 1,08,048 మందిని అరెస్టు చేయడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.2020లో వివిధ కేసుల్లో ఆంధ్రప్రదేశ్లో 80,869 మందిని అరెస్టు చేయగా 2021లో ఈ సంఖ్య 1,08,048కి చేరిందని కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడించింది. కేంద్ర హోం శాఖ సెప్టెంబర్ 3న ఒక నివేదికను విడుదలను చేసింది.ఆంధ్రప్రదేశ్ లో 2020తో పోలిస్తే 2021లో 27179 మంది (33.60 శాతం) ఎక్కువగా అరెస్టయ్యారని కేంద్ర హోం శాఖ నివేదిక పేర్కొంది. గతేడాది 2021లో దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
2019లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని ప్రతిపక్షాలకు చెందిన నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏదైనా పోస్టు పెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలీసులతో అరెస్టు చేయిస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు ఆరోపణలకు తగ్గట్టే కేంద్ర హోంశాఖ నివేదిక ఉండటం గమనించాలి.దేశంలో అరెస్టుల్లో మొదటి స్థానాన్ని ఉత్తర్ప్రదేశ్ (271084) దక్కించుకుంది. రెండో స్థానంలో బిహార్ (270934) మూడో స్థానంలో మధ్యప్రదేశ్ (128019) నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ (113697) నిలిచాయి. ఈ నాలుగు రాష్ట్రాల తర్వాత ఎక్కువ మంది అరెస్టయింది ఆంధ్రప్రదేశ్లోనే అని నివేదిక వెల్లడించింది.