వ్యావహారిక తెలుగు భాష అందాన్ని, విలువను గుర్తించి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు “గిడుగు రామ్మూర్తి” ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి కారణంగానే మన భాష మనగలుగుతుంది అని పవన్ కల్యాణ్ వివరించారు. విద్యార్ది దశ నుంచే తెలుగు భాషను పిల్లలకు నేర్పించాలని, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగాలన్న కేంద్ర ప్రభుత్వ విద్యావిధానాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు.
తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు “గిడుగు రామ్మూర్తి” గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భావితరాలకు తెలుగు భాషను వారసత్వ సంపదగా అందించేలా అందరూ కృషి చేయాలని, తద్వారా తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత చేకూర్చుదామని పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగువాళ్లం అని చెప్పుకోవడంలో భావోద్వేగం, సోదరభావం వ్యక్తమవుతాయని తెలిపారు. అటువంటి అమ్మ భాషను మనంతరం అనునిత్యం గౌరవించాలని వెల్లడించారు.
ఆంధ్రాలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విద్యార్థులకు తెలుగు నేర్పించడమే కాదు, పాలనా వ్యవహారాల్లో సైతం తెలుగు భాష వినియోగాన్ని పెంచాలని హితవు పలికారు. అన్ని వర్గాల వారు తెలుగు భాష పరిరక్షణకు సన్నద్ధమైన రోజునే గిడుగు వెంకట రామ్మూర్తికి నిజమైన నివాళి ఇచ్చిన వారమవుతాం అని అన్నారు.
తెలుగు భాషను వారసత్వ సంపదగా అందిద్దాం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pWrgmhLWd8
— JanaSena Party (@JanaSenaParty) August 29, 2022