ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమస్యలకు సంబంధించి ఢిల్లీపై నెపం నెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అయ్యిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ విభజన సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఎందుకు భేటీ కారని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చొరవ తీసుకోకుండా కేంద్రాన్ని తప్పు పట్టడం కరెక్టేనా అని నిలదీశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తెలంగాణలో స్థిరపడ్డ సెటిలర్ ఓట్ల కోసమైనా కేసీఆర్ స్పందిస్తారని ఎంపీ జీవీఎల్ అన్నారు. ఉదయం లేచింది మొదలు కేసీఆర్ సెటిలర్ల ఓట్ల గురించే మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఏపీలోని జగన్, చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నారనడంలో సందేహం లేదన్నారు. జగన్, చంద్రబాబు తమ స్వప్రయోజనాల కోసం కేసీఆర్తో రాజీ పడుతున్నారని జీవీఎల్ ఆరోపణలు చేశారు.
విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రితో గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా అని ఎంపీ జీవీఎల్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో మూడు గంటల పాటు ప్రెస్మీట్లు పెట్టకున్నా మూడు నిమిషాలైనా ఏపీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.