వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్ష పదవి మీద ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగిన వెంటనే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకి తెలిపారు. సీఎం జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు. దీంతో శాశ్వత అధ్యక్ష పదవి అనేది లేదని సజ్జల స్పష్టం చేశారు. శాశ్వత అధ్యక్ష పదవిపై ఈసీ వివరణ కోరినట్లుగా వచ్చిన వార్తలపై సజ్జల స్పందించారు. ప్రస్తుతానికి ఐదేళ్ల వరకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షుడిగా ఉంటారని సజ్జల తెలిపారు. ఆ తర్వాత ఎన్నిక జరగనున్నట్లు వెల్లడించారు. ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు వివరించారు. శాశ్వత అధ్యక్షుడు పదవికి సంబంధించి స్పష్టత ఇవ్వమని ఎన్నికల సంఘం అడిగిందని, ఇదే అంశాన్ని ఈసీకి చెప్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు ఉండబోవని ఆ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇలా చేయడం ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమని ఈసీ పేర్కొంది . ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా ఎన్నికలు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది. వైసీపీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలోనే పార్టీపై పూర్తి స్తాయి పట్టు ఉన్న జగన్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారన్న విమర్శలకు ఆ పార్టీ ముఖ్య నేతలు కౌంటర్ ఇచ్చారు.
పార్టీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్‌ను పార్టీ శాశ్వతఅధ్యక్షునిగా ఎన్నుకున్నారు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు,ఈ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ పార్టీని వివరణ కోరింది.సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాము ఐదేళ్లకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని ఈసీకి చెబుతామని అంటున్నారు.