జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇచ్చిన అనేక వాగ్దానాలలో ఎస్సీ వర్గీకరణ ఒకటి. అత్యంత సంక్లిష్టమైన సమస్యల్లో ఇది కూడా ఒకటి. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలైనా సైలెంట్ గా వున్న జగన్ ప్రభుత్వం మీద నెమ్మదిగా వత్తిడి పెరుగుతుంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పష్టత ఇవ్వాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం విశాఖపట్నంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై తన వైఖరిని బహిరంగపరచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆనాడు కేంద్రం ప్రభుత్వంతో చర్చించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టారన్నారు.
ఎస్సీ రిజర్వేషన్లకు అనుకూలంగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని అప్పటి కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్పమొయిలీకి ఇచ్చిన వినతిపత్రంలో కడప ఎంపీ హోదాలో జగన్మోహన్‌రెడ్డి స్వయంగా సంతకం పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ మొదటి ప్లీనరీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జగన్మోహన్‌రెడ్డి తీర్మానం చేశారన్నారు.ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలంటూ సుప్రీంకోర్టు నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపిదని, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల అభిప్రాయాన్ని తెలియజేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఈ అంశం లేవనెత్తి ముందుకు నడిపించాలని కూడా ఎంపీలకు జగన్మోహన్‌రెడ్డి సూచించాలని కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కృష్ణ మాదిగ హెచ్చరించారు.