వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. టీడీపీలోని మహిళలను ఉద్దేశించి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం గుడివాడలోని టీడీపీ ఆఫీస్ వద్దకు నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గ మధ్యలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్యను పోలీసులు పామర్రు వద్ద అడ్డుకున్నారు. వారిని గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్, పెడన టీడీపీ ఇన్‌ఛార్జ్ కాగిత వెంకట ప్రసాద్‌లు గుడివాడకు చేరుకున్నారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి కొడాలి నానిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. అక్కడే ఫిర్యాదు స్వీకరిస్తామని పోలీసులు చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పామర్రు వద్ద పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా వారు కారులో నుంచి బయటకు దిగేందుకు నిరాకరించారు. దీంతో కారును చుట్టుముట్టిన పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. కారు డోర్ లాక్ చేసుకుని టీడీపీ నేతలు లోపలే కూర్చొన్నారు. కారు డోర్ బీడింగ్ తీసి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు.