ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తాల నుండి వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. వైసీపీ నేతలు వర్సెస్ అచ్చెన్న నాయుడు గా నడిచింది. ప్రతి ఒక్కరికీ అచ్చెనాయుడు సమాధానం ఇస్తూ పోయారు. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటూ పోయారు. బీఏసీ సమావేశంలో బిజినెస్ సహా బయట జరుగుతోన్న రాజకీయాలతో పాటు కుటుంబ సభ్యులపై ఆరోపణలు తదితర అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం ఏంటంటూ అచ్చెన్నను సీఎం జగన్ ప్రశ్నించారు. ఏ అంశం మీదనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. సభలో మేరుగ నాగార్జున చేసిన కామెంట్లను అచ్చెన్న ప్రస్తావించారు. పుట్టుకల గురించి విమర్శలేంటని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా సమావేశంలో బచ్చుల అర్జునుడు వ్యక్తిగత కామెంట్లు చేయలేదా అంటూ శ్రీకాంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
పార్టీ కార్యాలయం మీద దాడి ఏకంగా చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దండెత్తి రావడం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మీ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని మీరే ధ్వంసం చేసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మా కార్యాలయాన్ని మేమేందుకు ధ్వంసం చేసుకుంటామని “చెప్పేదానికి అర్ధం ఉండాలి కదా” అని అచ్చెన్నాయుడు కౌంటర్ వేశారు. అయ్యన్నపాత్రుడు కామెంట్లు చేశారు కాబట్టే చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చానని జోగి రమేష్ పేర్కొన్నారు. అయ్యన్న కామెంట్లు చేస్తే ఆయనను తప్పు పట్టాలి కానీ ఏకంగా చంద్రబాబు ఇంటి వద్దకు రావడమేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సభలో గొడవ చేయకుండా సహకరించాలని సీఎం జగన్ కోరారు. మీరు ఒకటంటే మా వాళ్ళు పది మాటలు అనగలరు’ అని లాస్ట్‌లో సీఎం అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పారు.
చంద్రబాబు రాసిస్తే అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడారని జోగి రమేష్ పేర్కొన్నారు. వైసీపీ నేతల కామెంట్లను జగన్ రాసిస్తున్నారని తామెప్పుడైనా కామెంట్ చేశామా అని ప్రశ్నించారు. కొడాలి నాని ఏం మాట్లాడారో చూడలేదా అని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో స్థానిక సంస్థల ఓటమిని కప్పి పుచ్చుకునేందుకు తన కుటుంబ సభ్యులను వైసీపీ వాళ్లేదో అన్నట్టు చంద్రబాబు లేనిది ఉన్నట్లు చూపించారు అని సీఎం జగన్ పేర్కొన్నారు.