“ఢిల్లీ లిక్కర్ పాలసీ” దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న విషయం. ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చేసి లిక్కర్ సిండికేట్లకు జోన్ల వారీగా వ్యాపారాన్ని ఇచ్చేసి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుందని సీబీఐ అనేక కేసులు నమోదు చేసింది. ఆ కేసులో ఎవరు ఉన్నారు ? ఎలా డబ్బులు చేతులు మారాయో చెబుతూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ పాలసీ స్కాంలో ఇది ప్రారంభం మాత్రమే,ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ఇంకా చాలా పరిణామాలు చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కాంపై చర్చ జరుగుతూండటం ఆసక్తి రేపుతోంది. అటు తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ,ఇటు ఆంధ్రాలో అధికార పార్టీకీ సంబంధం ఉందని, వారి వ్యవహారాలు కూడా బయటకు వస్తాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు చూస్తుందా? లేకపోతే ఏపీలోనే ప్రత్యేకంగా ఉన్న ఏపీ లిక్కర్ పాలసీ వ్యవహారాలను కూడా పరిశీలిస్తుందా అన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఏపీ లిక్కర్ పాలసీపై చాలా ఆరోపణలు ఉన్నాయి.
ఏపీ లిక్కర్ పాలసీ:
మూడు దశల్లో మద్యపాన నిషేదం చేస్తాం అని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. అధికారం పొందిన తరువాత ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. షాక్ కొట్టేలా ధరలు పెంచుతానని అప్పుడే తాగడం మానేస్తారని చెప్పి ధరలు విపరీతంగా పెంచారు. సుమారు 500% వరకూ ధరలు పెరిగాయి.లిక్కర్ షాపులు అన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఒక్కసారిగా పాపులర్ బ్రాండ్లను అమ్మడం ఆపేశారు.పాత బ్రాండ్లు ఒక్క సారిగా మాయమయ్యాయి.దేశంలో ఎక్కడా అమ్మని లిక్కర్ మాత్రం ఆంధ్రాలో దొరుకుతోంది. అమ్మడానికి పర్మిషన్ కూడా ఇవ్వని లిక్కర్‌ను ఏపీలో బినామీ కంపెనీల ద్వారా తయారు చేసి అమ్మిస్తున్నారని టీడీపీ చాలా కాలంగా విమర్శలు చేస్తుంది.అదాన్ డిస్టిలరీస్ పేరుతో సొంత మద్యం సరఫరా చేస్తూ వేల కోట్లు దండుకుంటున్నారన్న ఆరోపణలను చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇవన్నీ స్కాంలు జరుగుతున్నాయన్నదానికి ఆధారాలని టీడీపీ నేతలంటున్నారు.
అయితే తాజాగా ఏపీ లిక్కర్ స్కాం కూడా బయటకు వస్తుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శఇ విష్ణువర్దన్ రెడ్డితో పాటు జీవీఎల్ నరసింహారావు కూడా అన్నారు. అయితే వారు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ వైఎస్ఆర్‌సీపీ నేతలున్నారని అంటున్నారా లేకపోతే ఏపీ లిక్కర్ పాలసీపైనా సీబీఐ విచారణ చేయిస్తామని అంటున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ మద్యం స్కాం విషయంలో బయటపడబోయే విషయాలు సంచలనం సృష్టించడం ఖాయమని ఏపీ బీజేపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు.బీజేపీతో జగన్ వ్యవహరించే తీరును బట్టి యాక్షన్స్ వుంటాయి అన్నది ప్రజలకు తెలిసిన సత్యం