హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనపడడం లేదని, నియోజకవర్గ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నేరుగా కాకుండా ఈ సారి కొత్త పంధాలో వెళ్లారు. కొంత మంది హిజ్రాలతో కంప్లైంట్లు ఇప్పించారు. వారికి మద్దతుగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ ఉన్నా సమస్యల పరిష్కారం విషయంలో ఆయన శ్రద్ధ చూపిస్తున్నారని చెబుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బాలకృష్ణపై వైసీపీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లోకి వైసీపీ కార్యకర్తలు దూసుకు రావడంతో గందరగోళం ఏర్పడింది. హిందూపురంలో వైసీపీ తరపున ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యవహరిస్తున్నారు. మాజీ పోలీసు అధికారి అయిన ఆయన నాన్ లోకల్. ఈ కారణంగా వైసీపీ నేతల్లో ఓ వర్గం ఆయనకు దూరంగా ఉంటుంది. తన వర్గం నేతలతోనే ఐయన బాలకృష్ణపై పోరాటం చేస్తూంటారు.
రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంటారు. మరో వైపు బసవతారకం ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల హిందూపురం జిల్లా కావాలంటే బాలకృష్ణ ఉద్యమం కూడా చేశారు. అభివృద్ధి పనులుఇతర అంశాల విషయంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తూంటారు.కానీ స్థానికంగా ఉండకపోవడం రాజకీయ విమర్శలకు కారణం అవుతోంది.
హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన అనుచరులు,పర్సనల్ అసిస్టెంట్లు ఎక్కువగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. బాలకృష్ణ అప్పుడప్పుడూ పర్యటిస్తూంటారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వివిధ సందర్భాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అన్న క్యాంటీన్, సంచార ఆసుపత్రి వంటివి ఏర్పాటు చేశారు. అయితే ఆయన స్థానికంగా నివాసం ఉండరు. ఈ కారణంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. బాలకృష్ణ తరపున టీడీపీ యంత్రాంగం రాజకీయ పోరాటం చేస్తూ ఉంటుంది.