సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుండి మూడు రోజుల పాటు తన సొంత జిల్లా వైఎస్సార్ కడపలో పర్యటించనున్నారు.సెప్టెంబర్ 2న తన తండ్రి,మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్బంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళులర్పించనున్నారు.అలాగే పులివెందుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కడపకు బయల్దేరతారు. మధ్యాహ్నం 3.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని హెలికాఫ్టర్‌లో పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించి సాయంత్రం 5.35 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు.
రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8.40 నుంచి 9 గంటల వరకు వైఎస్సార్ ఘాట్‌లో జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అధికారులతో పలు సమీక్షలు నిర్వహించి సాయంత్రం తిరిగి ఇడుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం కడప విమానాశ్రయానికి చేరుకుని ఉదయం 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకోనున్నారు.