రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలవల ద్వారా కరువు ప్రాంతాలకు నీటిని అందించే విషయమై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చెరువులన్నింటికి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయడం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. పనులు పూర్తి చేయకుండా వదిలేసిన బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.మచిలీపట్నం రామాయపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నట్లు తెలిపిన సీఎం వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయి కనుక, వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం చాలా అవసరమన్నారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
కరవు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల కొత్త చెరువులు తవ్వాలని ప్రపంచబ్యాంకు సాయంతో వీటిని అమలు చేయాలని నిర్దేశించారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, కేఎఫ్‌బీ బ్యాంకు, రుణ సాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను సీఎం సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ.25,497 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం వివరించారు. బ్యాంకుల రుణాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.






