పోలవరం పనుల్లో మరింత వేగం పెంచేందుకు వీలుగా అడహక్ గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని,ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాంపోనెంట్ వారీగా రీయింబర్స్ విధానంతో నిర్మాణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతున్న దృష్ట్యా దీనికి స్వస్తి చెప్పాలని కోరారు.
రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ అంశాలను విన్నవించేందుకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.అన్ని జాతీయ ప్రాజెక్టుల్లో వ్యవహరించిన మాదిరిగానే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు చేస్తున్న పనులకు వెంటనే రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా పోలవరం, రిసోర్స్ గ్యాప్ నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధత, విభజన హామీల అమలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానితో చర్చించి వినతిపత్రం అందజేశారు.
రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించండి:
పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సొంతంగా రూ.2,900 కోట్లు ఖర్చు చేసిందని, ఈ మొత్తాన్ని వెంటనే రీయింబర్స్ చేయాలని సీఎం జగన్ కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన మేరకు ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాల న్నారు. డీబీటీ పద్దతి ద్వారా భూసేకరణ, సహాయపునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితులకు పరిహారాన్ని అందించాలి అని విన్నవించారు.