అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు. బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వమన్నారు. పచ్చళ్లు అమ్మినా మావారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీల మనస్తత్వమని చిట్‌ఫండ్ వ్యాపారమైనా తమ వాళ్లే వ్యాపారం చేయాలని మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వమని పరోక్షంగా రామోజీరావు మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. చివరికి, పాఠశాలలు కూడా మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వమని ప్రతిపక్ష పార్టీలో కూడా తన మనుషులే ఉండాలనేది వీళ్ల మనస్తత్వమని విమర్శించారు. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పరిపాలనా వికేంద్రీకరణపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నుంచి 2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఒక్క ఉద్యమం చేయలేదని కానీ, గత 1,000 రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు హయాంలో రాజధాని కోసం ఏడాదికి రూ.1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని సీఎం జగన్ తెలిపారు. ఐదేళ్లలో రూ. 5 వేల కోట్లు పెట్టి ఇంకా రూ.1,05,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే వందేళ్లకు రెండు, మూడింతల రెట్టింపు అవుతుందని వివరించారు. అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడం లేదని విశాఖపట్నం, కర్నూలులో కూడా రాజధానులు పెడుతున్నామని వివరించారు.తనకు అమరావతిపై ఎలాంటి కోపం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎందుకు కోపం ఉండాలని ప్రశ్నించారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని అమరావతి అనేది అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు దూరంగా ఉందని ఆ ప్రాంతంలో కనీస వసతి సౌకర్యాలు కూడా లేవన్నారు.