విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో సంచలన పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.హిందూపురం వైసీపీ ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ ఇక్బాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని గతంలో డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారని ఈ సర్టిఫికెట్ ఉన్నవారు ఎమ్మెల్యేగా ఉండటానికి అనర్హులని తేల్చిచెప్పారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఇక్బాల్ అంటున్నారు. అలాగే కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేస్తానన్నారు.
వైఎస్సార్ ఎన్టీఆర్ లను గౌరవించి అభిమానించే ఏకైక పార్టీ వైసీపీ యేనని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత చంద్రబాబుకు కానీ ఆయన వారసులకు కానీ లేదన్నారు. ఆరోగ్యశ్రీ పేరును మార్చిందని చంద్రబాబేనని గుర్తు చేశారు. రాజకీయం కోసం మాత్రమే ఎన్టీఆర్ పేరును చంద్రబాబు ఎన్టీఆర్ కుమారులు వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజల్లో నుంచి ఎన్టీఆర్ పేరును తొలగించాలని ప్రయత్నించింది చంద్రబాబు కాదా అని ఇక్బాల్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతిడిని చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఈ దారుణాన్ని ఎన్టీఆర్ కుమారులు అడ్డుకోకపోగా వారు ఆయనను వేధించారని విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు బాలకృష్ణకు లేదని తేల్చిచెప్పారు.